మెగాస్టార్ చిరంజీవి నానికి ఒక సైకిల్ బాకీ ఉన్నాడట. ఆ బాకీ తీర్చాల్సిందే అని పట్టుబడుతున్నాడు నేచురల్ స్టార్. మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేసే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నాని ఈ సైకిల్ కథ చెప్పాడు. ఆ కథేంటో తెలుసుకుందాం పదండి.
నాని చదువుకునే రోజుల్లో ఇంట్లో వాళ్లు నాకో సైకిల్ కొనిచ్చారట. మెగాస్టార్ సినిమా మాస్టర్ రిలీజైనపుడు నాని ఆ సైకిల్ వేసుకునే హైదరాబాద్ అమీర్ పేటలోని సత్యం థియేటర్లలో సినిమా చూడ్డానికి వెళ్లాడట. అప్పటికే జనం పెద్ద ఎత్తున పోగై ఉండగా.. సైకిల్ బయటే పెట్టేసి కష్టపడి టికెట్ కౌంటర్లోకి దూరిపోయి.. ఎలాగోలా టికెట్ అయితే పట్టేశాడట నాని. కానీ బయటికి వచ్చి చూస్తే సైకిల్ మాత్రం లేదట. అయినప్పటికీ మెగాస్టార్ సినిమా టికెట్ దొరికిందన్న ఆనందంలో సినిమాకు వెళ్లిపోయాడట. తిరిగి వచ్చాక మళ్లీ సైకిల్ కోసం వెతికినా ఫలితం లేకపోయిందట. అప్పుడు తనకు ఏడుపొచ్చిందని చెప్పాడు నాని. ఇంట్లో వాళ్లకు ఏవో మాయ మాటలు చెప్పి కవర్ చేసేశాడట.
ఐతే చిరుకు అత్యంత సన్నిహితుడైన ఆయన బావ అల్లు అరవింద్ నిర్మాణంలో భలే భలే మగాడివోయ్ సినిమా చేసినపుడు ఆయనకు ఈ విషయం చెబితే.. కచ్చితంగా సైకిల్ కొనిస్తానని హామీ ఇచ్చారట. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని.. కాబట్టి చిరంజీవి గారే సైకిల్ ఇవ్వాలని ఎంఈకే షోలో అడిగాడు