బాహుబలి: ది కంక్లూజన్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అద్భుతంగా ఆడేస్తోంది. భారీ వసూళ్లు సాధిస్తోంది. ఐతే బాహుబలి-2 ప్రదర్శన థియటర్లకు మాత్రమే పరిమితం కావట్లేదు. కంప్యూటర్లలో.. మొబైళ్లలో కూడా ఈ సినిమా ఇరగాడేస్తోంది. బాహుబలి-2 పైరసీ వెర్షన్ ప్రస్తుతం కోట్లాది మొబైళ్లలో విజయవంతంగా నడుస్తోంది. సినిమాను థియేటర్లలో యథేచ్ఛగా మొబైళ్లతో రికార్డు చేసేసి.. చిన్న చిన్న వీడియోలుగా విడగొట్టి వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసేస్తున్నారు జనాలు. వాటితో పాటు కొన్ని క్వాలిటీ పైరసీ ప్రింట్లు కూడా ఆన్ లైన్లోకి వచ్చేశాయి. వాటిని డౌన్ లోడ్ చేసి.. షేర్ ఇట్ లాంటి సాధనాల ద్వారా కూడా సర్కులేట్ చేస్తున్నారు.
పైరసీ ప్రింట్లు పెట్టే టొరెంట్ల మీద గత ఏడాది ఉక్కు పాదం మోపిన నేపత్యంలో గతంతో పోలిస్తే డౌన్ లోడ్స్ తగ్గాయి. పైగా అందరికీ అది అవగాహన ఉన్న వ్యవహారం కాదు. ఐతే ఇప్పుడు అందరూ డౌన్ లోడ్ చేసుకుని చూడాల్సిన అవసరం లేదు. ఒక ఆఫీసులో ఎవరో ఒకరి దగ్గర పైరసీ వెర్షన్ ఉందంటే చాలు.. షేర్ ఇట్ ద్వారా అందరి మొబైళ్లలోకి వెళ్లిపోతుంది. బాహుబలి-2 లాంటి సినిమాను మొబైళ్లలో చూస్తే కిక్కే ఉండదు. అయినప్పటికీ చూసేవాళ్లు చూస్తూనే ఉన్నారు. అలా ఈ సినిమాకు రావాల్సిన ఆదాయానికి కోత పడుతోంది