Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jun-2016 13:49:13
facebook Twitter Googleplus
Photo

??ఇండస్ట్రీలో ఇలాంటి పాత్ర పోషించగల నటుణ్ని నేనొక్కడినే?? అని చెప్పుకోవడం నందమూరి బాలకృష్టకు మాత్రమే చెల్లింది. ఆయన అన్న మాటలు అతిశయోక్తులమీ కావు. ఈ తరంలో ఆయనలా పౌరాణిక పాత్రలు పోషించే నటుడు మరెవరూ కనిపించరు. అందరూ మరిచిపోయిన పౌరాణికాల్ని గుర్తు చేస్తూ ?శ్రీరామరాజ్యం? సినిమాతో తన ప్రత్యేకతను చాటుకుని.. ఈ తరంలో తన లాంటి ఆల్ రౌండర్ మరెవరరూ లేరని చాటుకున్నాడు. సవాలు కూడా విసిరాడు. ఇక అంతకుముందు బాలయ్య చేసిన ఆదిత్య 369.. భైరవ ద్వీపం లాంటి సినిమాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవి కూడా బాలయ్య మాత్రమే చేయగల సినిమాలే.

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు కొడుగ్గా పుట్టడం.. ఆయన వారసుడిగా సినీ పరిశ్రమలోకి రావడం వరమే. గుర్తింపు కోసం ఆరాట పడనవసరం లేదు. అవకాశాల కోసం వెంపర్లాడనవసరం లేదు. స్టార్ ఇమేజ్ కోసం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయనక్కర్లేదు. ఐతే ఎన్టీఆర్ కొడుగ్గా ఇండస్ట్రీలోకి రావడం వరమే కాదు శాపం కూడా. ఎన్టీఆర్ కొడుకంటే జనాలు ఎంతగా అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిదీ అత్యుత్తమంగా ఆశిస్తారు. ఎలా నటించినా.. ఏ పాత్ర ఎంచుకున్నా.. ఏ సినిమా చేసినా.. ఎన్టీఆర్తో పోల్చి చూస్తారు. వాళ్ల అంచనాలకు ఏమాత్రం తగ్గినా పెదవి విరుస్తారు.

ఐతే బాలయ్య వరాన్ని వరంగానే మార్చుకున్నాడు. ఎన్టీఆర్ కొడుగ్గా తనకు వచ్చిన సానుకూలతన్నింటికీ సమర్థంగా ఉపయోగించుకున్నాడు. తన ప్రతిభతో ప్రతికూలతల్ని దిగ్విజయంగా అధిగమించాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూనే.. ఎన్టీఆర్ నీడ నుంచి బయటికి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. 43 ఏళ్లుగా నిర్విరామంగా నటిస్తూ ఇప్పటికీ తన ప్రత్యేకత చాటుకుంటూ తన 'శత' చిత్ర సంబరానికి ఉత్సాహంగా అడుగులేస్తున్నాడు. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా 'తుపాకి' పాఠకుల కోసం ఈ ప్రత్యేక కథనం..

కేవలం వారసత్వం ఉంది కాబట్టే.. ఎన్టీఆర్ కడుపున పుట్టాడు కాబట్టే ఆయన ఈ స్థాయికి వచ్చేశాడని.. అనుకుంటే పొరబాటే. పేర్లు చెప్పి ఇంకొకరిని నొప్పించడం ఎందుకు కానీ.. ఒక్కసారి తెలుగు సినీ పరిశ్రమలో వారసులుగా వచ్చినవాళ్లందరూ విజయవంతం అయ్యారా.. అందరూ పెద్ద స్టార్లు అయిపోయారా.. అన్నది సమీక్షించుకుంటే బాలయ్య గొప్పదనం ఏంటి అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. వారసత్వం అన్నది అరంగేట్రం సాఫీగా సాగిపోవడానికి ఉపయోగపడుతుంది కానీ.. ఆ తర్వాత మాత్రం స్వీయ ప్రతిభతోనే నిలదొక్కుకోవాలి. మంచి పాత్రలు ఎంచుకోవాలి. మంచి సినిమాలు ఎంచుకోవాలి. నటనలో ప్రతిభ చాటాలి. తన ప్రత్యేకత చాటుకోవాలి. విజయాలకు పొంగిపోకూడదు. పరాజయాలకు కుంగిపోకూడదు. బాలయ్య ఇవన్నీ చేశాడు.

బాలయ్య కెరీర్లో ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసే బ్లాక్ బస్టర్లకు కొదవలేదు. తెలుగు సినిమా నడతనే మార్చేసే ట్రెండ్ సెట్టింగ్ సినిమాలూ చాలానే ఉన్నాయి. మంగమ్మగారి మనవడు? మొదలుకుని.. భార్గవరాముడు.. ముద్దులమావయ్య.. రౌడీ ఇన్స్పెక్టర్.. బంగారుబుల్లోడు.. సమరసింహారెడ్డి.. నరసింహనాయుడు.. సింహా.. లెజెండ్.. ఇలా బాలయ్య బాక్సాఫీస్ స్టామినాను చాటిన బ్లాక్ బస్టర్ హిట్లు లెక్కలేనన్ని ఉన్నాయి. ఐతే బాలయ్య అంటే బాక్సాఫీస్ బొనాంజా మాత్రమే కాదు.. వైవిధ్యమైన సినిమాలకూ కేరాఫ్ అడ్రసే. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు చేయడానికి సాహసించని ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్.. భైరవద్వీపం ద్వీపం లాంటి జానపద చిత్రం.. 21వ శతాబ్దంలో మరే కథానాయకుడూ ప్రయత్నించని 'శ్రీరామరాజ్యం' లాంటి పౌరాణికం.. ఇలా బాలయ్య కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన ఇంకెవరికీ సాధ్యం కాని ఎన్నో సినిమాలు చేశాడు బాలయ్య.

బాలయ్య కెరీర్లో ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే.. ఆయన వందో సినిమా మరో ఎత్తులా కనిపిస్తోంది. తన ముందు ఎన్నో ప్రత్యామ్నాయాలున్నా.. రెగ్యులర్ మాస్ సినిమాతో సేఫ్గా సెంచరీ మైలురాయిని దాటేసే అవకాశమున్నా బాలయ్య మాత్రం గొప్ప సాహసానికి సిద్ధమయ్యాడు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' లాంటి సాహసోపేత చారిత్రక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. తన ముందుకు ఊరించే మాస్ మసాలా ఆప్షన్లు చాలా వచ్చినా.. వాటన్నింటినీ కాదని క్రిష్ లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ తో 'గౌతమీపుత్ర శాతకర్ణి' లాంటి సినిమాను ఎంచుకోవడంలోనే బాలయ్య ప్రత్యేకత కనిపిస్తుంది. తెలుగు భాష - సంస్కృతి అంటే బాలయ్యకు ఎంత అభిమానమో చెప్పడానికి ఇది రుజువు. మన చరిత్ర గురించి ఈ తరానికి తెలియజెప్పాలనే తపనతో ఎంతో శ్రమతో ముడిపడ్డ ఈ సినిమాను తెరమీదికి తీసుకొచ్చాడు.

బాలయ్య కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ రోజు బాలయ్య జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరింతగా అంచనాల్ని పెంచింది. ఈ శత చిత్రం బాలయ్య నట ప్రయాణంలో మరో మైలురాయిలా నిలిచిపోతుందని ఆశిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది tollypost.com

,  ,  ,  ,  ,