చిన్నసినిమాలు ఎన్ని వచ్చినా.. వాటిల్లో చాలా సినిమాలు మెరిసినా.. అగ్రహీరో సినిమా మెరుపులు ముందు.. అవన్నీ బుచుకు.. బుచుకూ అనాల్సిందే. అగ్రహీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు.. ఆ హడావుడి ఒక రేంజ్లో ఉంటుంది. ఇటీవల కాలంలో సినిమాను ప్రమోట్ చేసుకునే పద్ధతుల్లో వచ్చిన మార్పులు పుణ్యమా అని.. భారీగానే హడావుడికి ప్లాన్ చేస్తున్నారు.
గతంలో సినిమా రిలీజ్ కు ముందు మహా అయితే.. ఆడియో ఫంక్షన్.. రిలీజ్ కాస్త ఆలస్యమైతే.. ఆడియో సక్సెస్ ఫంక్షన్ చేసేవారు. కానీ.. ఇప్పుడు ఫస్ట్ లుక్ మొదలు.. ఫస్ట్ టీజర్.. ఆడియో ఫంక్షన్ ఇలా చాలానే చేస్తున్నారు.
బాలయ్య వందో సినిమాగా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలకు ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమా విడుదలను అనుకున్న సమయానికి పూర్తి చేయటానికి బాలకృష్ణ తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రిలీజ్ కు ముందు గ్రాండ్ గా సినిమాను ప్రమోట్ చేసేందుకు వీలుగా.. డిసెంబర్ లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా డిసెంబరు 9న టీజర్ ను.. డిసెంబరు 16న ఆడియో ఫంక్షన్ ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదంతా అయ్యాక.. ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లాంటివి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. సో.. డిసెంబరు మొత్తం బాలయ్య హడావుడి ఉండనుందన్న మాట.