తరం యంగ్ హీరోల స్టైల్ మారిపోతోంది. ఒకప్పుడు ఇతర హీరోల పేర్లు కూడా ఎక్కడా తలిచేవారు కాదు. స్టార్ స్టేటస్ కోసం పోటీ పడ్డం.. తాము సోదరుల లాంటి వారం అని అడపాదడపా అనడమే తప్ప.. ప్రవర్తనలో అది కనిపించేది కాదు. కానీ ఈ జనరేషన్ యంగ్ హీరోలు మాత్రం.. తమ అభిమాన హీరోలు అంటూ ఎవరినైనా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తమ కుటుంబ హీరోలను ఎలాగూ అభిమానిస్తారు.. ఇతర హీరోలను కూడా పొగిడేసే కల్చర్ మాత్రం కొత్తగానే ఉంది.
యంగ్ హీరో అల్లు శిరీష్ ఈ విషయంలో అసలే మాత్రం భేషజాలకు పోడు. పలు ఈవెంట్స్ లో స్టార్స్ ను.. యాక్టర్స్ ను ప్రశంసలు విమర్శలు కలిపి గుప్పించిన ఈ హీరో.. ఇప్పుడు తమ ఇంటికి సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ చేరిన విధానాన్ని చెప్పుకొచ్చాడు. అంతే కాదు చూపించాడు కూడా. అల్లు వారింటికి వీరంతా నిజంగా విచ్చేయలేదు కానీ.. వారి ప్రతిరూపాలైన బొమ్మలు మాత్రం శిరీష్ రూమ్ లో సందడి చేస్తున్నాయి. బాహుబలిలో ప్రభాస్ బొమ్మ.. కబాలి గెటప్ లో రజినీకాంత్.. క్రిష్ గా సందడి చేస్తున్న హృతిక్ రోషన్ ల బొమ్మలు.. శిరీష్ టేబుల్ పైకి వచ్చి చేరాయి.
ఈ మూడు బొమ్మలను కలిపి ఒకచోటకు చేర్చి.. ఫోటో తీసి దాన్ని నెట్ లో షేర్ చేసేసి తన ఆనందం చాటుకున్నాడు అల్లు శిరీష్. ఎమర్జింగ్ హీరోకి ఉండాల్సిన లక్షణాలను అన్నిటినీ పుణికి పుచ్చుకుంటున్న అల్లు శిరీష్ కి.. ఇప్పుడు ఇతర హీరోల అభిమానులు తనను ఎలా మెచ్చాలో.. ఆ కిటుకు బాగానే పసిగట్టేసినట్లున్నాడు. మెగా ఫ్యాన్స్ అండ ఎలాగూ ఈ కుర్రాడికి ఉంటుంది.