Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Sep-2015 12:28:52
facebook Twitter Googleplus
Photo

పూరి జగన్నాథ్.. మాస్ ఎంటర్ టైనర్ లతో రికార్డుల మోత ఎలా మోగించాలో ప్రాక్టికల్ గా నిరూపించిన జనరేషన్ డైరెక్టర్. పరిశ్రమ మెచ్చిన తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో నిలిచిన టాప్ డైరెక్టర్. నచ్చిందే తీసి సూపర్ హిట్ కొట్టడం అతడికే చెల్లింది. సినిమా అంటే స్పీడ్ గానే తీయాలి. స్పీడ్ స్క్రీన్ ప్లే తోనే మ్యాజిక్ చేయాలి.. అని ప్రూవ్ చేసిన సిసలైన డైరెక్టర్. ఎవరి మాటా వినొద్దు. మనిషి మాట అసలే వినొద్దు అని చెప్పే పూరి .. సినిమా తీసే విషయంలో తనకి తానే బాస్. మనసుకి నచ్చే పంథాలో వెళతాడు. డేట్ ఫిక్స్ చేసి సినిమా తీస్తాడు. హిట్ కొడతాడు. హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్ మాసిజం అని నిరూపించాడు. తన హీరోల్ని మాస్ హీరోలుగా చూపించి బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకోవడం పూరీకే సాధ్యమైంది. పూరి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ ని ఓ మారు తరచి చూస్తే ..

టాలీవుడ్ లో ఉన్న అరడజను పైగా స్టార్ హీరోల్ని కమర్షియల్ హీరోలుగా టాప్ స్లాట్ లో నిలబెట్టిన దర్శకుడు పూరి. పవన్ కల్యాణ్ - మహేష్ - రవితేజ - ఎన్టీఆర్ - ప్రభాస్ - చరణ్ - అల్లు అర్జున్ .. మాస్ లో బాస్ లు అయ్యారంటే ఆ వెనక పూరీ అనే బ్రహ్మాస్త్రం పనిచేయడం వల్లే. మహేష్ ని సూపర్ స్టార్ గా ఆవిష్కరించింది పూరీ. మహేష్ కెరీర్ గ్రాఫ్ నే మార్చేసిన 'పోకిరి' ఇచ్చింది పూరి. ఆ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ గా మలిచిన ప్రతిభ పూరీ సొంతం. ఆరోజుల్లోనే పోకిరి 30 కోట్లు పైగా వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. మహేష్ ని పూర్తి మాస్ హీరోగా ఆవిష్కరించిన చిత్రమిది. పోకిరి తమిళ్ - కన్నడ - మలయాళం - హిందీలో రీమేకై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వందల కోట్ల వ్యాపారం చేసింది ఈ చిత్రం. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నా 'బిజినెస్ మేన్'తో మహేష్ కెరీర్ లో మరో కీలకమైన హిట్ ని ఇచ్చాడు.

మాస్ మహారాజా రవితేజని స్టార్ ని చేసింది పూరీ. అతడిలోని మాసిజాన్ని వెలికి తీసింది పూరి. రవితేజని ఇడియట్ ని చేసి తెలుగు ప్రజలంతా అభిమానించేలా చేసింది రవితేజనే. మాస్ రాజాకి యూత్ లో ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉందంటే అది ఇడియట్ ఇచ్చిన కిక్కు వల్లే. రవితేజలోని కొత్తకోణాన్ని ఎప్పటికప్పుడు ఎలివేట్ చేయడానికి తనకు ఉన్న అన్ని మర్గాల్లో ప్రయత్నించాడు పూరీ. అమ్మా నాన్న తమిళమ్మాయ్ - ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం - ఇడియట్ - నేనింతే ఇలా విలక్షణమైన సినిమాలెన్నో రవితేజతో తెరకెక్కించిన ఘనత పూరి సొంతం.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి 'బద్రి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని అందించి ఘనమైన ఎంట్రీ ఇచ్చింది పూరీనే. సుదీర్ఘ గ్యాప్ తర్వాత మరోసారి పవన్కి కెమెరామెన్ గంగతో రాంబాబుతో మరో హిట్టిచ్చాడు. ఈ చిత్రం విషయంలో కొంత వివాదం చెలరేగినా అది వసూళ్ల సునామీకి కారణమైంది. ప్రతికూలతలోనూ సానుకూల ఫలితం దక్కించుకుందీ సినిమా. మెగాస్టార్ నటవారసుడు చరణ్ ని చిరుత సినిమాతో వెండితెరకు పరిచయం చేయడమే కాకుండా అతడికి మాస్ ఇమేజ్ ని మొదటి సినిమాతోనే తెచ్చి పెట్టిన దర్శకుడిగా పూరీ పేరు తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ ని 'దేశముదురు'గా చూపించిన గొప్పతనం పూరీది. బన్నిని పూర్తి స్థాయి కమర్షియల్ హీరోగా ఆవిష్కరించిన చిత్రమిది. బన్ని రూపంలో టాలీవుడ్ లోనే మొదటి 6ప్యాక్ హీరోని క్రియేట్ చేసిందే పూరీనే. బుజ్జిగాడు సినిమాతో ప్రభాస్ మ్యానరిజంలో సంథింగ్ స్పెషాలిటీని చూపించి మాస్ లో డిష్కసన్ పాయింట్ అయ్యాడు.

ఎన్టీఆర్ ని కొత్త కోణంలో చూపించిన ఏకైక దర్శకుడు పూరి. అసలు తారక్ ఏంటి? 6ప్యాక్ ఏంటి? ఆ లుక్కేంటి? అని పరిశ్రమ సహా ప్రేక్షకాభిమానులు అవాక్కయ్యేలా చేసిన గూరూ పూరి. ఇంతవరకూ తన కెరీర్ లోనే కనిపించనంత కొత్తగా టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ కనిపించాడు. టెంపర్ ఈ ఏడాది ఆరంభమే రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ విజయంలో పూరి కష్టాన్ని అంత తేలిగ్గా తీసి పారేయలేం. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని మరీ ఈ చిత్రం రిలీజై అంచానాల్ని చేరుకుంది. పెద్ద విజయాన్ని అందించింది. ఎన్టీఆర్ ని అతడి కెరీర్ లోనే ఇంతవరకూ ఎవరూ చూపించనంత కొత్తగా చూపించిన ఘనత పూరీకే చెందింది. ఎన్టీఆర్ లుక్ పూర్తి స్టయిలిష్ గా మార్చేయడమే కాకుండా 6ప్యాక్ లో చూపించి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ మేరకు తారక్ ని మోటివేట్ చేసింది పూరీనే.

నాగార్జునతో శివమణి - సూపర్ వంటి డిఫరెంట్ మూవీస్ ని తెరకెక్కించాడు. యూత్ లో ఈ రెండు సినిమాలు పెద్ద క్రేజు క్రియేట్ చేశాయి. గోలీమార్ వంటి యాక్షన్ సినిమాతో గోపిచంద్ ని యూత్ లో హాట్ ఫేవరెట్ చేశాడు పూరి. పూరీ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ సినిమాతో నితిన్ స్థాయి మరో మెట్టు పెరిగింది. ఆ సినిమా విజయం నితిన్ మార్కెట్ రేంజును పెంచింది. అలాగే లుక్ పరంగానూ నితిన్ లో చాలా మార్పులే తెచ్చాడు పూరి. ఇలా పూరి ఏం చేసినా ప్రతిదాంట్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. అంతేకాదు అందాల ఛార్మిని జ్యోతిలక్ష్మిగా చూపించి టాలీవుడ్ లో డిష్కసన్ పాయింట్ అయ్యాడు. ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ని కమర్షియల్ హీరోగా ఆవిష్కరించే పనిలో ఉన్నాడు. వరుణ్ తేజ్ హీరోగా లోఫర్ ఆన్ సెట్స్ ఉంది. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమాకి పూర్తి స్థాయి స్క్రిప్టుని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి 'ఆటో జానీ' అనే టైటిల్ ని పూరి నిర్ణయించాడు. పరిశ్రమపై మనం ఆధారపడడం కాదు.. పరిశ్రమే మనపై ఆధారపడాలి... అన్నంత ఎత్తుకి ఎదిగాడు పూరి.

కమర్షియల్ సినిమా తెరకెక్కించాలనుకునే ప్రతి ఫిలింమేకర్ చదవాల్సిన డిక్షనరీ పూరి జగన్నాథ్. కమర్షియాలిటీలో కొత్తదనం జొప్పించిన మొనగాడు పూరి. 600 కోట్ల ఖరీదైన 'బాహుబలి'ని క్రియేట్ చేసిన అసాధారణ దర్శకుడు రాజమౌళి అంతటివాడే పూరీ అవకాశం ఇస్తే తన వద్ద అసిస్టెంట్ గా పనిచేయాలనుంది అని అన్నారంటే అది పూరీలోని యూనిక్ క్వాలిటీని గుర్తు చేస్తుంది. టాలీవుడ్ లో ఎందరు దర్శకులు ఉన్నా పూరి యూనిక్. చెప్పిన టైమ్ లోనే మాట ఇచ్చిన ప్రకారమే ముందే ఫిక్స్ చేసిన డేట్ ప్రకారమే సినిమా రిలీజ్ చేసి చూపించడం పూరీ స్టయిల్. సెట్ లో కూల్ గా ఉంటాడు. కూల్ గా అందరితో పని చేయించుకుంటాడు. అంతే కూల్ గా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసేస్తాడు

ఇకపోతే ఈ మధ్య కాలంలో పూరి జ'గన్' అనుకున్నట్లు పేలడం లేదు. సినిమాలు తడబడుతున్నాయి. కథ లేదు అనే రిమార్కు వినిపిస్తోంది. కథనంతో నెట్టుకొస్తున్నాడు కాని సరైన కంటెంట్ పై ఫోకస్ చేయట్లేదని విమర్శ కూడా వింటున్నాం. అందుకు తగినట్లే సినిమాలు కూడా ధియేటర్లలో త్వరగా తీసేస్తున్నారు. మరి లోఫర్ తో బౌన్స్ బ్యాకయ్యి పూరి జగన్ మరోసారి తన జెండా ఎగరేస్తాడని ఆశిస్తూ.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

,  ,  ,