దీపావళి అనగానే సెలెబ్రిటీలంతా వీధుల్లోకి వచ్చేస్తారు. కుటుంబ సభ్యులు - స్నేహితులతో కలిసి బాణా సంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటారు. ఈసారి కూడా చాలామంది సెలబ్రిటీలు అదే పనిచేశారు. కానీ హీరో రామ్ చరణ్ మాత్రం తన భార్య ఉపాసనతో కలిసి జిమ్ములోనే పండగ చేసుకున్నాడు. అదెలా అంటారా? ఈమధ్య రామ్ చరణ్ ఫిట్ నెస్ ఫ్రీక్ అయిపోయాడన్న విషయం తెలిసిందే. మొదట్నుంచీ ఆయనకి ఫిట్ నెస్ పై ప్రత్యేకమైన ప్రేమ ఉన్నప్పటికీ ధృవ కోసం మరింతగా కసరత్తులు చేస్తున్నాడు. అథ్లెట్ లుక్ లో కనిపించాలని కండలు పెంచుతున్నాడు. పనిలో పనిగా తన భార్య ఉపాసనకి కూడా ఫిట్ నెస్ పాఠాలు నేర్పిస్తున్నాడు. ఈమధ్య ఇద్దరూ కలిసి జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపిస్తున్నారు.
అయితే దీపావళి పండగ రోజున కూడా వాళ్లు జిమ్ లోనే గడపడం విశేషం. రామ్ చరణ్ కసరత్తులు చేస్తూ చెమటోడుస్తుంటే ఆయన భార్య ఉపాసన వీడియో తీసి మిస్టర్ సి దీపావళి పండగని ఇలా జరుపుకొంటున్నాడని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రామ్ చరణ్ త్వరలోనే ధృవ సినిమాలోని టైటిల్ సాంగ్ చేయబోతున్నాడు. ఆ పాట కోసమే జిమ్ములో కసరత్తులు మొదలుపెట్టాడని ఉపాసన తెలిపారు. కానీ ఉపాసన తీసిన వీడియలో రామ్ చరణ్ పెంచిన కండలు మాత్రం భలే కనిపించాయి. ఇక సినిమాలో వాటిని ఏ రేంజ్ లో ప్రదర్శించాడో ఊహించొచ్చు. మొత్తంగా ధృవ సినిమాతో తనని తాను కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలనే తపనతో కనిపిస్తున్నాడు చరణ్.