ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ రిలాక్సెడ్ మూడ్ లో ఉన్నాడు. జై లవ కుశ మూవీలో యంగ్ టైగర్ యాక్టింగ్ కి యథావిధిగానే మంచి మార్కులు పడడం.. సినిమా కూడా సక్సెస్ పట్టాలను దాటేయడం.. తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనుండడం.. మధ్యలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుండడం లాంటివి ఎన్టీఆర్ ని బాగానే అలరిస్తున్నాయి.
జనవరి చివరలో మాటల మాంత్రికుడి మూవీ షూటింగ్ మొదలుపెట్టనున్నాడు జూనియర్. త్రివిక్రమ్ బిజీగా ఉన్నా.. ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఎన్టీఆర్ ఓ నిర్ణయానికి వచ్చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ మూవీలో హీరోయిన్ అంటూ కన్నడ భామ పూజా హెగ్డే.. మలయాళీ సుందరి అను ఇమాన్యుయేల్ పేర్లు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే పేరును ఎన్టీఆర్ రిఫర్ చేశాడని కూడా అంటున్నారు. అయితే.. ఇందులో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తోంది. హీరోయిన్ అంశాన్ని పూర్తిగా దర్శకుడికే వదిలేశాడట యంగ్ టైగర్.
క్యారెక్టర్ ప్రకారం హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలో తుది నిర్ణయం త్రివిక్రమ్ కే ఇచ్చాడట. ప్రస్తుతం లుక్ టెస్టులు.. ఆడిషన్స్ లాంటివి చేసే తీరిక ఈ డైరెక్టర్ కు లేదు. అందుకే మొదటగా ఆ విషయాన్ని పక్కన పెట్టేశారని తెలుస్తోంది. పవన్ అజ్ఞాతవాసి రిలీజ్ వరకూ త్రివిక్రమ్ బిజీ. ఆ తర్వాత ఎన్టీఆర్ మూవీ షూటింగ్ స్టార్ట్.