దర్శకత్వం : వేణు శ్రీరామ్
నిర్మాత : దిల్ రాజు, శిరీష్ , లక్ష్మణ్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని నుండి వచ్చిన మరొక చిత్రం "మిడిల్ క్లాస్ అబ్బాయి" . ట్రైలర్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం కథ :
నాని (నాని)కి తన అన్న(రాజీవ్ కనకాల) అంటే చాలా ఇష్టం. కానీ అన్నకు పెళ్ళై వదిన జ్యోతి (భూమిక) వాళ్ళ మధ్యకు రాగానే వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. దాంతో వదినపై కాస్తంత చిరాకు పెంచుకుంటాడు నాని. అదే సమయంలో పల్లవి (పల్లవి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.
ప్రభుత్వ ఉద్యోగి అయిన జ్యోతికి డ్యూటీ విషయంలో లోకల్ రౌడీ వరంగల్ శివతో గొడవ మొదలవుతుంది. దాంతో శివ ఆమెను చంపాలని ప్రయత్నిస్తాడు. దానికి నాని అడ్డుపడతాడు. ఇలా గొడవ పెద్దదై శివ నాని వదినను చంపుతానంటూ ఛాలెంజ్ చేస్తాడు. ఒక సాదా సీదా మిడిల్ క్లాస్ కుర్రాడైన నాని శివ నుండి వదినను ఎలా కాపాడుకున్నాడు ? శివను ఏం చేశాడు ? అనేదే సినిమా.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ నాని. మిడిల్ క్లాస్ కుర్రాడిలా నాని నటన చాలా బాగుంది. సినిమా బలహీనపడుతోంది అనే సమయానికి నాని తన నేచ్యురల్ పెర్ఫార్మెన్స్ తో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. చాలా చోట్ల సక్సెస్ అయ్యాడు కూడ. ప్రథమార్థంలో వచ్చే నాని, అతని మిడిల్ క్లాస్ జీవితం తాలూకు సీన్లు, వదినకి అతనికి మధ్య నడిచే చిన్నపాటి మనస్పర్ధను బయటపెట్టే సన్నివేశాలు బాగున్నాయి. ఇందులోనే వచ్చే నాని, సాయి పల్లవిల లవ్ ట్రాక్ కూడా కొంత సరదాగా సాగుతూ ఆకట్టుకుంది.
నాని, సాయి పల్లవి కలిసి కనిపించే సన్నివేశాలు అందంగా కనిపిస్తూ కొంత ఆహ్లాదాన్నిచ్చాయి. మరీ పెర్ఫార్మెన్స్ చేసేంత స్కోప్ లేనప్పటికీ సాయి పల్లవి తన పాత్రలో బాగానే నటించింది. భాధ్యతగల వదినగా భూమిక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చూపి మెప్పించారు. ఇక సెకండాఫ్ చివరి 15 నిముషాల్లో నాని తన వదినను కాపాడుకునే సీక్వెన్స్ బాగుంది. ఇక విలన్ పాత్ర చేసిన విజయ్ పెర్ఫార్మెన్స్ వలన సినిమాలో కొంత తీవ్రత కనబడింది.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు ముఖ్యమైన బలహీనత కొత్త కథంటూ లేకపోవడం. చాలా సినిమాల్లో చూసినట్టే మధ్యతరగతికి చెందిన కుర్రాడు అప్పటి వరకు ఖాళీగా ఉంటూ తన కుటుంబానికి ఆపద ఎదురైనప్పుడు హీరోలా మారిపోతాడు. ఇదే ఈ సినిమా పాయింట్ కూడ. ఈ పాయింట్ ను ఆరంభంలో నాని తన నటనతో కొంత ఆసక్తికరంగానే లాగినా ఆ తర్వాత కథనంలో బలహీనత కొట్టొచ్చినట్టు బయటపడటంతో బోర్ కొట్టేసింది.
ముఖ్యంగా ఇంటర్వెల్ కు అసలు కథ రివీల్ అయిపోవడంతో సెకండాఫ్లో ఏం జరుగుతుంది అనేది సులభంగా ఊహించేయవచ్చు. విలన్ పాత్ర యొక్క ముగింపును తప్ప ప్రతి పాత్ర ప్రవర్తన, పరిస్థితి ఎక్కడికక్కడ ఊహకందిపోతూనే ఉంటాయి. దీంతో సినిమాపై పెద్దగా ఆసక్తి కానీ, చూస్తున్నంతసేపు థ్రిల్ కానీ కలగవు.
ఇక క్లైమాక్స్ లో దర్శకుడు కొంత ఎక్కువ స్వేచ్ఛను వాడేసుకోవడం వలన కొన్ని కీలక మలుపుల్లో లాజిక్స్ లోపించాయి. ఎక్కడా మెచ్చుకోదగిన రీతిలో దర్శకత్వ ప్రతిభ కనబడలేదు. ఇక మధ్యలో వచ్చే పాటలైతే ఎక్కడికక్కడ అడ్డుతగులుతున్నట్టే అనిపించాయి. అసలిది దేవిశ్రీ సంగీతమేనా అనిపిస్తుంది. సినిమా ముగిశాక ఒక్కటంటే ఒక్క పాట కూడా గుర్తుకురాదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు వేణు శ్రీరామ్ పాత కథనే తీసుకున్నా దానికి కొత్తగా అనిపించే కథనాన్ని, సన్నివేశాలని రాసుకోవడంలో విఫలమయ్యారు. సినిమాను తొందరగా రొటీన్ కథలోకి తీసుకెళ్లకుండా నానితో ఎక్కువసేపే మేనేజ్ చేసినా ఇక కథలోకి ప్రవేశించక తప్పదు అన్నప్పుడు ఒక్కో లోపం బయటపడుతూ సెకండాఫ్ నిరుత్సాహానికి గురిచేసింది.
దేవి శ్రీ నుండి ఆశించిన స్థాయి సంగీతం ఈ సినిమాలో దొరకలేదు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు. సమీర్ రెడ్డి బాగానే ఉంది. పాటల చిత్రీకరణలో అందం కనబడింది. దిల్ రాజు నిర్మాణ విలువలు ఎప్పటిలాగానే మంచి స్థాయిలో ఉన్నాయి.
తీర్పు :
మొత్తం ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. నాని నటన, ఫస్టాఫ్లో కొంత ఫ్యామిలీ డ్రామా, లవ్ ట్రాక్, క్లైమాక్స్, ముఖ్య తారాగణం నటన బాగుండగా చాలా సినిమాల్లో చూసిన పాత కథ, కొత్తగా అనిపించని, ఊహించదగిన సన్నివేశాలు, ఆసక్తిని కలిగించలేకపోయిన కథనం, దేవి శ్రీ సంగీతం అంచనాలను అందుకోలేకపోవడం వంటి అంశాలు బలహీనతలుగా నిలిచి సినిమాను జస్ట్ యావరేజ్ స్థాయిలో నిలబెట్టాయి. నాని నటనను అమితంగా ఇష్టపడేవాళ్లు, సినిమా రెగ్యులర్ ఫార్మాట్లోనే ఉన్నా ఎంజాయ్ చేయగల ప్రేక్షకులు ఈ సినిమాను చూడొచ్చు.
Rating:3.25/5