Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2017 15:42:42
facebook Twitter Googleplus
Photo

చిత్రం : మిస్టర్

నటీనటులు: వరుణ్ తేజ్ - హెబ్బా పటేల్ - లావణ్య త్రిపాఠి - ఆనంద్ - ఈశ్వరిరావు - సత్యం రాజేష్ - శ్రీనివాసరెడ్డి - రఘుబాబు - హరీష్ ఉత్తమన్ - మురళీ శర్మ - నాజర్ - నాగినీడు - షకలక శంకర్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: గుహన్
కథ: గోపీమోహన్
మాటలు: శ్రీధర్ సీపాన
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)-ఠాగూర్ మధు
స్క్రీన్ ప్లే - మాటలు: శ్రీను వైట్ల

ఒకప్పుడు తనదైన శైలి కామెడీ ఎంటర్టైనర్లతో తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన శ్రీను వైట్ల.. ఆ తర్వాత ఒకే కామెడీ ఫార్ములాను పట్టుకుని వేలాడటంతో ఆగడు.. బ్రూస్ లీ రూపంలో గట్టి ఎదురు దెబ్బలు తిన్నాడు. బ్రూస్ తర్వాత ఏడాదిన్నర పైగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు మిస్టర్ తో ప్రేక్షకుల్ని పలకరించాడు వైట్ల. మరి వైట్ల తన గత సినిమాల ఛాయాల్లోంచి బయటికి వచ్చాడా.. మిస్టర్ లో కొత్తదనం చూపించాడా.. ప్రేక్షకుల్ని మెప్పించాడా.. చూద్దాం పదండి.

కథ:

స్పెయిన్లో తన తల్లిదండ్రులతో కలిసి ఉండే పిచ్చయ్య నాయుడు అలియాస్ చై (వరుణ్ తేజ్) అనుకోకుండా మీరా (హెబ్బా పటేల్) అనే అమ్మాయిని కలుస్తాడు. తనతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెకేవో అబద్ధాలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్తాడు. పని మీద స్పెయిన్ వచ్చిన మీరా.. వారం రోజుల్లో చై.. అతడి కుటుంబానికి దగ్గరవుతుంది. ఐతే చై తన ప్రేమను చెప్పబోయే సరికి తాను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు చెబుతుంది మీరా. ఐతే మీరా ఇండియా వచ్చేశాక తన పెళ్లికి సమస్య ఎదురైందని తెలిసి చై స్పెయిన్ నుంచి బయల్దేరతాడు. మీరా సమస్యను పరిష్కరించే క్రమంలో అతడికి చంద్రముఖి (లావణ్య త్రిపాఠి) పరిచయమవుతుంది. ఆమె వల్ల చై ఇబ్బందుల్లో పడతాడు. మరి ఈ ఇద్దరమ్మాయిల వల్ల చై ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు.. ఆ ఇద్దరి సమస్యల్ని ఎలా పరిష్కరిస్తాడు.. చివరికి వీళ్లిద్దరిలో ఎవరికి అతను సొంతమవుతాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఆగడు దెబ్బకు కచ్చితంగా శ్రీను వైట్లలో మార్పు వస్తుందని అందరూ ఆశించారు. కానీ వైట్ల మళ్లీ పాత కామెడీ ఫార్ములానే నమ్ముకుని బ్రూస్ లీ తీశాడు. దాని ఫలితమేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక మిస్టర్ తో మార్పు చూపించక తప్పని పరిస్థితిలో పడ్డాడు వైట్ల. ఈ సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ.. పదే పదే కొత్తదనం ప్రస్తావన తెచ్చాడు వైట్ల. ఇది తన గత సినిమాల్లాగా ఉండదని అన్నాడు. వైట్ల చెప్పింది నిజమే. ఇది వైట్ల గత సినిమాల్లాగా లేదు. వాటితో పోలిస్తే కొత్తగా ఉంది. కాకపోతే మిస్టర్ వైట్లకు మాత్రమే కొత్త కావడమే విచారకరమైన విషయం. ఈసారి వైట్ల తన శైలి ని మాత్రమే విడిచిపెట్టాడు. కానీ అరిగిపోయిన తెలుగు కమర్షియల్ సినిమాల్ని మాత్రం వదిలిపెట్టలేదు. అర్థరహితమైన కథాకథనాలు.. అరిగిపోయిన కమర్షియల్ ఫార్ములాలు.. ఇదీ స్థూలంగా మిస్టర్.

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో సుమోలు.. ఛేజింగులు అనేవి పెద్ద ఫ్యాషన్. హీరో హీరోయిన్ ఒక వెహికల్లో వెళ్తుంటే వెనుక పదుల సంఖ్యలో సుమోలు ఛేజ్ చేస్తుంటాయి. ఒక రౌడీ బ్యాచ్ వాళ్లను తరుముతుంటుంది. వాళ్లను బోల్తా కొట్టిస్తూ హీరో దూసుకెళ్లిపోతుంటాడు. మిస్టర్ సినిమాలో ప్రేక్షకులకు బంపరాఫర్ ఏంటంటే.. ఇక్కడ హీరోయిన్ ఒక్కరు కాదు.. ఇద్దరు. ఆ ఇద్దరి వెనుకా బోలెడంతమంది రౌడీలు పడుతుంటారు. ఒక్కొక్కరి వెనుక తక్కువలో తక్కువ ఒక వంద మంది రౌడీలు.. ఓ పాతిక సుమోలు.. ఇలా ఇద్దరి వెనుకా కలిపితే రెండొందల మంది రౌడీలు.. 50 సుమోలన్నమాట. కొండల్లో.. లోయల్లో.. అడవుల్లో.. బ్రిడ్జీల మీద.. తారు రోడ్ల మీద.. మట్టి రోడ్ల మీద.. ఎక్కడ పడితే అక్కడ ఛేజింగులే ఛేజింగులు.. ఫైటింగులే ఫైటింగులు. ఈ మధ్య కాలంలో ఇలాంటి థ్రిల్ ఇంకే సినిమాలోనూ లేదంటే నమ్మండి.

సినిమా మొదలైన దగ్గర్నుంచి మొదలుపెడితే.. కొంచెం పేరు.. గుర్తింపు ఉన్న నటీనటులు కనీసం పాతిక మందైనా తేలుతారు. ఇక లొకేషన్ల మాట చెప్పాల్సిన పని లేదు. స్పెయిన్ అందాలతో మొదలుపెడితే.. కర్ణాటక.. ఆంధ్రా.. తెలంగాణ.. కేరళ.. ఇలా చాలా రాష్ట్రాల్లోని అందమైన లొకేషన్లను వెతికి వెతికి మరీ సినిమాను షూట్ చేశారు. మొత్తంగా మిస్టర్ లో భారీతనానికి లోటే లేదు. కానీ కథాకథనాల సంగతి మాత్రం అడక్కండి. ప్రథమార్ధంతో స్పెయిన్ నేపథ్యంలో సాగే ఆ రొటీన్ లవ్ స్టోరీ.. ఊపిరి స్పూఫ్ కామెడీనే కొంచెం నయం. ఇక కథ అక్కడి ఇండియాకు మారాక మొదలవుతుంది మోత. ఎన్ని క్యారెక్టర్లు.. ఎన్ని ఛేజింగులు.. ఎన్ని ఫైట్లు.. అన్నీ చూసేసరికి రెండు మూడు సినిమాలు ఒకేసారి చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ చుట్టూ నడిపిన రాజ వంశీకుల ఎపిసోడ్ చూశాక.. ఒక్కసారి మనం ఏం సినిమాకు వచ్చాం.. ఏం చూస్తున్నాం.. సినిమా ఎలా మొదలైంది.. ఎలా సాగుతోంది.. ఎలా ముగియబోతోంది.. అన్న ప్రశ్నలు సడెన్ గా మన మెదళ్లను తొలిచేస్తాయి. మిస్టర్ పూర్తిగా ట్రాక్ తప్పేసి.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేది ఇక్కడే. ఈ ఎపిసోడ్ దెబ్బకు ఆ తర్వాతి సన్నివేశాల్లో కొంచెం కామెడీ ఉన్నా ఆస్వాదించలేని పరిస్థితికి వచ్చేస్తారు ఆడియన్స్. తెరంతా నిండిపోయిన క్యారెక్టర్లు ప్రేక్షకుల్ని తీవ్ర గందరగోళానికి గురి చేస్తాయి. హీరో హీరోయిన్లను ఆ పాత్రల మధ్య వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఎప్పుడు సినిమా అయిపోతుందా.. ఈ గందరగోళానికి ఎప్పుడు తెరపడుతుందా అన్నంతగా విసిగించేస్తాడు మిస్టర్.

ఫైనల్ ఔట్ పుట్ చూసుకున్నాక సినిమా నిడివిని రెండున్నర గంటలు ఉంచాలని నిర్ణయించుకున్నందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అంతిమంగా సినిమా అయ్యేసరికి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. దీంతో పోలిస్తే ఆగడు.. బ్రూస్ లీ లాంటి సినిమాలు ఎంతో నయం. ఫార్ములా కామెడీ అని తిట్టుకున్నా కాస్తో కూస్తో కామెడీ అయినా ఎంజాయ్ చేస్తాం. బహుశా ఒకే కామెడీ ఫార్ములాతో సినిమాలు తీస్తున్నాడని తనను తిట్టిపోసిన వాళ్లందరితోనూ.. అలాంటి సినిమాలే చెయ్యమని చెప్పించడానికి వైట్ల మిస్టర్ లాంటి సినిమాకు పూనుకున్నాడేమో మరి.

నటీనటులు:

కమర్షియల్ గా ఏమాత్రం ఆడినా ముకుంద.. కంచె లాంటి సినిమాల్లో వరుణ్ ను చూస్తే ముచ్చటేసేది. కుర్రాడు కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడనిపించేది. అలాంటి వాడు లోఫర్.. మిస్టర్ లాంటి సినిమాలు ఎందుకు ఎంచుకున్నాడో. లోఫర్ అయినా పర్వాలేదు కానీ.. మిస్టర్ లో మాత్రం వరుణ్ పాత్ర తలాతోకా లేకుండా ఉంది. అతడి నటన గురించి కూడా చెప్పుకోవడానికేమీ లేదు. లుక్ మాత్రం ఓకే. హీరోగా ఒక ఇమేజ్ అంటూ ఏమీ తెచ్చుకోని వరుణ్.. పెద్ద మాస్ హీరోలా అంతేసి ఫైట్లు చేయడానికి ఎలా ఒప్పుకున్నాడో మరి. మామూలుగా గ్లామర్ షోతో నెట్టుకొచ్చేసే హెబ్బా పటేల్ కు ఇందులో ఆ ఛాన్స్ దక్కలేదు. ఆమె లుక్ దెబ్బ తిని ఏదోలా కనిపించింది. లావణ్య అందంగా కనిపించింది. కానీ హీరోయిన్లద్దరికీ కూడా నటన పరంగా స్కోప్ ఏమీ ఇవ్వలేదు ఆ పాత్రలు. హీరో హీరోయిన్ల తర్వాత చెప్పుకోవడానికి చాలా పాత్రలే ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి-రఘుబాబు ఊపిరి స్పూఫ్ లో పర్వాలేదనిపించారు. పృథ్వీ కామెడీ పెద్దగా పండలేదు. ఉన్న కాసేపు ప్రియదర్శి పర్వాలేదనిపించాడు. నెగెటివ్ రోల్స్ చేసిన నిఖితిన్ ధీర్.. హరీష్ ఉత్తమన్.. నాగినీడు పెద్దగా ఆకట్టుకోలేదు. నాజర్ ఓకే. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

మిక్కీ జే మేయర్ శైలికి తగ్గ సినిమా కాదిది. ప్రియ స్వాగతం.. అనే పాటలో తన ముద్ర చూపించిన మిక్కీ.. మిగతా పాటల విషయంలో కన్ఫ్యూజ్ అయినట్లున్నాడు. తన శైలికి భిన్నమైన మాస్ పాటల్లో అంతగా మెప్పించలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు తగ్గట్లుగా మొక్కుబడిగా లాగించేశాడు. సినిమా అంతటిలో గుహన్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా ఓకే. సినిమాకు ఎంత ఖర్చు పెట్టారో తెరమీద కనిపిస్తుంది. సినిమాకు ఎంత వరకు ఆకర్షణ అయ్యాయన్నది పక్కనబెడితే లొకేషన్లు.. సెట్టింగ్స్.. కాస్టింగ్ అన్నింట్లోనూ భారీతనం కనిపిస్తుంది. గోపీమోహన్ కథ కిచిడీలా అనిపిస్తుంది. చాలా సినిమాల్ని కలిపి రెండు వేర్వేరు కథలు రాసి.. తర్వాత దాన్ని ఒక సినిమాగా చేసినట్లు అనిపిస్తుంది. శ్రీధర్ సీపాన మాటలు కూడా మామూలే. నువ్వేమైనా ప్రభాస్ అనుకుంటున్నావా.. ప్రభాస్ శీనులా ఉన్నావ్ లాంటి అరిగిపోయిన డైలాగులు రాశాడతను. ఇక వైట్ల గురించి చెప్పేదేముంది. ఆనందం లాంటి సినిమాల్ని గుర్తుకు తెస్తానని చెప్పి.. అది తప్ప చాలా కమర్షియల్ సినిమాల్ని తలపించాడు వైట్ల. ఆగడు.. బ్రూస్ లీ ఎంత రొటీన్ అయినా.. అతడి కామెడీ టైమింగ్ కనిపించేది. మిస్టర్ లో అది కూడా మిస్పయిపోయింది. ఏదో చేసేద్దామని బోలెడన్ని క్యారెక్టర్లు పెట్టుకుని.. భారీ కథను రాయించుకుని.. దాన్ని చాలా గందరగోళంగా తెరకెక్కించాడు వైట్ల
Rating:2.5/5

(Average Rating 5.0 Based on 1 views)
,  ,  ,  ,  ,