అచ్చ తెలుగు హీరోయిన్ లయకు యాక్సిడెంట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. అమెరికాలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో కలిసి లాస్ ఏంజెల్స్ కు వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తోంది. ఐతే లయకు ఓ మోస్తరు గాయాలయ్యాయని.. ఆమె ప్రాణానికేం ప్రమాదం లేదని అంటున్నారు. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నపాటి శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉందట. మిగతా కుటుంబ సభ్యుల పరిస్థితేంటన్నది తెలియ రాలేదు.
స్వయంవరం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన విజయవాడ అమ్మాయి లయ. ఆరేడేళ్ల పాటు తెలుగులో ఆమె పలు సినిమాల్లో నటించింది. నంది అవార్డు కూడా అందుకుంది. గత రెండు దశాబ్దాల్లో ఈ మాత్రం పేరు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ లు లేరు. 2006లో ఓ ఎన్నారై డాక్టర్ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైంది లయ. ఆ తర్వాత సినిమాల వైపు చూడలేదు. మధ్య మధ్యలో కొన్ని టీవీ కార్యక్రమాల్లో మాత్రం కనిపించింది. 2008 లో లయ ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు శ్లోక అనే పేరు పెట్టింది. యాక్సిడెంటుకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.