Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2017 10:42:45
facebook Twitter Googleplus
Photo

ఇండస్ట్రీ అంతా హిట్స్ చుట్టూరానే తిరుగుతుంది. ఓ హిట్ ఇచ్చాడంటే చాలు.. ఆ దర్శకుడి చేతిలో అడ్వాన్స్ పెట్టేసే నిర్మాతలు.. పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చే స్టార్లకు మన టాలీవుడ్ లో కొదువ లేదు. అయితే.. ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడి వైపు మాత్రం దాదాపుగా ఎవరూ కన్నెత్తి చూడరు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తప్పించుకుని తిరిగే బాపతు కూడా ఉంటారు.

కానీ మెగా హీరోల రూటే సెపరేటు. వరుసగా మెగా హీరోలు ఫ్లాప్ డైరెక్టర్లతో సినిమాలు చేయడమే కాదు.. భారీ సక్సెస్ లు కూడా కొట్టేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నంబర్ 150 తీసి.. ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు దర్శకుడు వినాయక్. దీనికి ముందు అఖిల్ లాంటి డిజాస్టర్ తీయడంతో.. చిరుతో ఛాన్స్ మిస్ అయినట్లే అనుకున్నారు కానీ.. మెగా టీం మాత్రం వినాయక్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంచింది.

దీనికి ముందు ధృవతో సక్సెస్ సాధించాడు రామ్ చరణ్. ఈ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన తీరును అద్భుతం అని ప్రశంసలు దక్కాయి. ధృవకు ముందు సూరి తీసిన మూవీ కిక్2. ఫ్లాప్ ఇచ్చినా.. సురేందర్ రెడ్డిపై కాన్ఫిడెన్స్ తో సినిమా చేశాడు చెర్రీ. వీళ్లిద్దరికి ముందు హరీష్ శంకర్ తో సుబ్రమణ్యం ఫర్ సేల్ అంటూ హిట్ సాధించాడు సాయిధరం తేజ్. రామయ్యా వస్తావయ్యా లాంటి ఫ్లాప్ తర్వాత హరీష్ శంకర్ తీసిన చిత్రం ఇది. ప్రస్తుతం బన్నీతో డీజే కూడా తీసేస్తున్నాడు హరీష్ శంకర్.

ఇవన్నీ ఇప్పటికే వచ్చేసి హిట్స్ సాధించిన సినిమాలు.. దర్శకుల చిట్టా అయితే.. రాబోయే సినిమాల లెక్క కూడా ఇలాగే ఉంది. వరుణ్ తేజ్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో మిస్టర్ మూవీ రానుంది. ఆగడు.. బ్రూస్ లీ ఫ్లాప్స్ తర్వాత వైట్ల చేస్తున్న చిత్రం ఇదే. అలాగే.. ఫామ్ లో లేని శేఖర్ కమ్ములతో ఫిదా చిత్రం చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఫ్లాప్ డైరెక్టర్లపై నమ్మకం ఉంచి.. సినిమా ఇచ్చి.. బ్లాక్ బస్టర్స్ కొడుతున్న మెగా ఫ్యామిలీని అభినందించాల్సిందే.

,  ,  ,  ,  ,  ,