Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Dec-2016 12:10:10
facebook Twitter Googleplus
Photo

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తీయాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరితో తీయాలి.. అసలు గౌతమిపుత్ర శాతకర్ణి ఎలా ఉండాలి అనే అంశాలపై మథనపడ్డాడట దర్శకుడు క్రిష్. 'శాతకర్ణి చూపు తీక్షణంగా ఉండాలి. మాటల్లో రాజసం ఉండాలి. నడుస్తుంటే కాగడా రగులుతున్నట్లు ఉండాలి. ఒక కథే కథానాయకుడిని ఎన్నుకుంటుంది. ఆ కథే నాకు చెప్పింది.. బసవరామ తారక పుత్ర బాలకృష్ణ ఒక్కడు మాత్రమే ఈ శాతకర్ణి పోషించగలడు అని చెప్పింది. శాతకర్ణి ఖ్యాతిని దశదిశలు ఆయన మాత్రమే విస్తరించగలడు. ఆవేశంతో కాదు.. ఆలోచనతో చెబుతున్నా' అంటూ ఆవేశంగానే చెప్పాడు క్రిష్.

'సాయిమాధవ్ .. సీతారామశాస్త్రి ప్రతీ సారి అనుకునే వాళ్లం. బాలకృష్ణ ఈ కథ 10 నిమిషాలు విని.. 14 గంటల్లోనే ఈ సినిమా చేద్దాం అన్నారు. ఏమైనా పర్లేదు చేసేద్దాం అని భరోసా ఇచ్చారు. సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అని నేనే చెప్పాను. ఆరోజు నుంచి ఈ రోజు వరకూ .. ప్రణాళికా బద్ధంగా వెళ్లాం' అన్న క్రిష్.. అమరావతితో ఇప్పుడు అనుబంధాన్ని కూడా పంచుకున్నాడు. 'ఎప్పుడో శాతకర్ణి అమరావతిని రాజధానిగా చేసుకుని ఏలడం ఏంటి? ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక అమరావతి రాజధాని కావడం ఏంటి? ప్రతిదీ దైవ సంకల్పం. అమరావతి ఖ్యాతి ప్రపంచవ్యాప్తం చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు' అంటూ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాడు.

'శాతవాహనుల రాజ్యానికి సింహద్వారం కోటిలింగాల. ప్రస్తుతం కరీంనగర్ లో ఉంది. అమరావతి కేంద్రంగా.. కన్యాకుమారి నుంచి. హిమాచలం వరకు విస్తరించింది. ఒకవేళ గ్రీస్ లో పుట్టి ఉంటే.. వంద పుస్తకాలు రాసేవాళ్లు.. పది సినిమాలు తీసేవాళ్లు.. మూడు ఆస్కార్ లు వచ్చి ఉండేవి. గ్లాడియేటర్ ట్రాయ్ మాదిరిగా వచ్చేవి.. కానీ మన ఖర్మ. మనం తీయలేదు' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు జాగర్లమూడి రాధాకృష్ణ.

'తెలుగు జాతి గర్వపడే సినిమా తీశా. టికెట్ల తెగడం కోసం.. నాలో ఉన్న కోపంలోంచి చెబుతున్నాను' అన్న క్రిష్.. ఈ మూవీకోసం బాలయ్య ఎంత కష్టపడ్డారో వివరించాడు. 'ఈ సినిమాకు నాతో కెప్టెన్.. నాతో పాటు సెట్ లోకి వచ్చే వారు.. నాతో పాటు వెళ్లేవారు.. ఆయనే సెట్ అసిస్టెంట్ .. ఆయనే హీరో.. ఆయనే లైట్ బాయ్' ఇంతగా గౌతమిపుత్ర శాతకర్ణి కోసం తపన పడ్డ బాలయ్యకు ..జై బాలయ్య.. జై బాలయ్య నినాదాలతో కృతజ్ఞతలు తెలిపాడు క్రిష్.

చివరగా ' శాతకర్ణి గురించి తాము తెలుసుకుని ప్రజలకు తెలియచేస్తున్న మీడియా మిత్రులకు థ్యాంక్స్. ట్రైలర్ రిలీజ్ తర్వాత తెలుగు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే.. శాతకర్ణి గురించి మీరంతా ఎదురుచూస్తున్నారని అర్ధమైంది' అంటూ తన ఆనందాన్ని వివరించిన క్రిష్.. 'సమయం లేదు మిత్రులారా.. సంక్రాంతికి వస్తుంది.. ఖబడ్దార్' అనడంతో.. ఆడిటోరియం అంతా హోరెత్తిపోయింది.

,  ,  ,  ,  ,