Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2017 12:42:40
facebook Twitter Googleplus
Photo

రజినీకాంత్ తమిళులకే కాదు.. తెలుగు వాళ్లకూ సూపర్ స్టారే. కమల్ హాసన్ను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడతారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక సూర్య సినిమాలు తమిళంలో ఎలా ఆడతాయో.. తెలుగులోనూ అంతే ఆదరణ పొందుతుంటాయి. ఇంకా చాలామంది తమిళ హీరోలకు తెలుగునాట మంచి ఫాలోయింగ్ ఉంది. మార్కెట్టూ ఉంది. ఐతే మన హీరోలే చాలా ఏళ్ల పాటు వేరే రాష్ట్రాల మీద.. పొరుగు మార్కెట్ల మీద దృష్టిపెట్టలేదు. ఐతే ఈ మధ్య వాళ్లలో కదలిక వస్తోంది. స్టార్ హీరోలు నెమ్మదిగా.. తమ మార్కెట్ ను విస్తరించుకుంటున్నారు. తమ పరిధి పెంచుకుంటున్నారు. ద్విభాషా.. త్రిభాషా చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. వేరే భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది ప్రభాస్.. మహేష్ పేర్లే.

టాలీవుడ్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు.. ప్రభాస్ ఇప్పుడు పొరుగు మార్కెట్లపై కన్నేశారు. టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానానికి పోటీలో ఉన్న ఈ ఇద్దరూ వేరే రాష్ట్రాల్లో సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్ ఆల్రెడీ ‘బాహుబలి’తో వేరే రాష్ట్రంలో మంచి గుర్తింపే సంపాదించాడు. ఐతే ఇది బలుపా.. వాపా అన్నది తేలాల్సి ఉంది. ‘బాహుబలి’ అలా ఆడేసినంత మాత్రాన ప్రభాస్ ఇంకే సినిమా చేసినా ఇలాగే అదరగొట్టేస్తుందని అనుకోవడానికి లేదు. ‘బాహుబలి’తో వచ్చిన క్రేజ్ చూసుకుని.. ఈ సినిమా బడ్జెట్ ను ఏకంగా రూ.50 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెంచేశారు. ‘బాహుబలి’ విడుదలకు ముందు అయితే ఈ చిత్రాన్ని ప్రభాస్ తెలుగులో మాత్రమే చేసేవాడేమో. కానీ తర్వాత కథ మారిపోయింది. ‘సాహో’ త్రిభాషా చిత్రంగా మారింది. ఈ సినిమాకు ‘సాహో’ అనే టైటిల్ పెట్టడం కూడా ‘బాహుబలి’ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడమే. ఐతే సినిమా అంచనాలకు తగ్గట్లుగా లేకుంటే మాత్రం ప్రభాస్ ఒక్కసారిగా కింద పడటం ఖాయం. ఆ తర్వాత ద్విభాషా.. త్రిభాషా చిత్రాల గురించి ఆలోచించడం కష్టమవుతుంది.

ఇక మహేష్ గ్లామర్ చూస్తే అతను బాలీవుడ్ కు బాగా సూటవుతాడని చాలామంది అంటుంటారు. కానీ అతడికి ముంబయికి వెళ్లే ఆలోచనలేమీ లేవు. కానీ తమిళనాట ఫాలోయింగ్ పెంచుకోవాలని మాత్రం ప్రయత్నిస్తున్నాడు. మహేష్ చివరి రెండు సినిమాలు ‘శ్రీమంతుడు’ ‘బ్రహ్మోత్సవం’లను తమిళంలోకి అనువాదం చేసి రిలీజ్ చేశారు. కానీ వాటి వల్ల పెద్దగా ప్రయోజనమేమీ కనిపించలేదు. ఐతే ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను మాత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కిస్తున్నారు. మురుగదాస్ సినిమా కాబట్టి తమిళంలోనూ ఈ చిత్రాన్ని పెద్ద స్థాయిలో రిలీజ్ చేయడానికి అవకాశం దక్కింది. తమిళంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి ఇది మంచి అవకాశమని మహేష్ భావిస్తున్నాడు. అందుకే తెలుగులో చేసి.. డబ్ చేయడం కాకుండా నేరుగా తమిళంలోనూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమిళ వెర్షన్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారట. ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోవడానికి కూడా కారణాలివే.

,  ,  ,  ,  ,