బాహుబలి మూవీలో హీరో ప్రభాస్ తో దాదాపు సమానంగా ఉండే రోల్ భల్లాలదేవ. ఈ కేరక్టర్లో రానా ఒదిగిపోయిన తీరు అసామాన్యం.
అయితే.. ఈ పాత్రకు రానా ఫస్ట్ ఆప్షన్ కాదట. ముందు వేరే వ్యక్తిని అనుకుని.. ఆ తర్వాత వేరే కారణాలతో రానా చెంతకు చేరిందట. ఈ విషయాన్ని స్వయంగా రానానే చెప్పుకొచ్చాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఖల్ డ్రోగో కేరక్టర్లో కనిపించిన జాసన్ మొమోవా తో ఈ రోల్ చేయించాలని దర్శక నిర్మాతలు భావించారని రానా చెప్పాడు. ఆ హాలీవుడ్ యాక్టర్ చేయాల్సిన రోల్ తన దగ్గరకు రావడంతో సంతోషించాడట. జాసన్ కు తాను రీప్లేస్మెంట్ అనే ఆలోచనే బాగా కిక్ ఇచ్చిందట. అయితే.. గ్లాడియేటర్ మాదిరిగా ఓ అతి పెద్ద కాన్వాస్ ఉన్న సినిమా చేస్తున్నట్లు ఆ సమయంలోనే రాజమౌళి చెప్పారని అన్నాడు రానా.
అప్పటికి బాహుబలిని ఒక భాగంగా మాత్రమే తీయాలని భావించారని.. అయినా సరే దాదాపు మూడేళ్ల సమయం పడుతుందని చెప్పేసరికి చాలానే ఆలోచించుకోవాల్సి వచ్చిందని అన్నాడు రానా. విలన్ రోల్ లో కనిపించడంపై సందేహించినా.. ఇంతటి భారీ ప్రాజెక్టులో యాక్ట్ చేసే అవకాశం లైఫ్ టైంలో మళ్లీ రాకపోవచ్చని అనుకున్నాడట.