అఖిల్ సినిమా తేడా కొట్టేసింది. ఐతే ఆ సినిమాను ఓకే చేయడంలో అక్కినేని నాగార్జున తప్పు కూడా ఎంతో కొంత లేకుండా పోదు. కానీ నాగార్జున ఆ సినిమా విషయంలో ఈ మధ్య స్పందిస్తున్న తీరు మాత్రం ఇండస్ట్రీ జనాలకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. తన కొడుకును రీలాంచ్ చేస్తున్నానని.. ఇదే అతడి అసలైన అరంగేట్రం అని నాగ్ చెప్పడం అఖిల్ దర్శక నిర్మాతల్ని అవమానించడమే అన్న అభిప్రాయాలు వినిపించాయి.
సినిమాల్లో సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది సహజమని తెలిసిన నాగార్జున.. కొడుకు తొలి సినిమా పోవడాన్ని జీర్ణించుకోలేక తన అసహనాన్ని చూపిస్తున్నాడన్న చర్చ జరిగింది. మరోవైపు అఖిల్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అఖిల్ ఫ్లాప్ కావడం మంచిదే అని.. లేదంటే తాను అలాంటి సినిమాలే చేస్తూ పోయేవాడినేమో అంటూ వ్యాఖ్యానించడం కూడా అఖిల్ దర్శకుడు వినాయక్ ను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యే.
ఇప్పుడు నాగ్.. అఖిల్ లను అనుసరిస్తూ సమంత సైతం వేరే అర్థాలు ధ్వనించే వ్యాఖ్య చేసింది ‘హలో’ ప్రి రిలీజ్ ఈవెంట్లో. హలో సినిమాలో నిజమైన అఖిల్ కనిపించాడని.. తమకు నిజమైన అఖిల్ ను చూపించినందుకు విక్రమ్ కుమార్ కు థ్యాంక్స్ అని ఆమె అంది.