Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Nov-2016 12:55:53
facebook Twitter Googleplus
Photo

నటుడిగానే పాపులర్ అయినప్పటికీ తనికెళ్ల భరణిలో ఓ మంచి రచయిత ఉన్నాడు. ఒకప్పుడు ఆయన రచయితగా క్షణం తీరిక లేకుండా గడిపారు. చాలా సినిమాలకి కథ - మాటల్ని అందించారు. ఆయన రచనలో రూపుదిద్దుకున్న సూపర్ హిట్ చిత్రాల్లో లేడీస్ టైలర్ ఒకటి. వంశీ దర్శకత్వం వహించిన ఆ చిత్రం అప్పట్లో సంచలనాలు సృష్టించింది. ఇప్పటికీ ఆ సినిమాని - అందులోని కామెడీ సన్నివేశాల్ని ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అందుకే దానికి సీక్వెల్ తీయాలని వంశీ ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. లేడీస్ టైలర్ కి రచయితగా పనిచేసిన తనికెళ్ల భరణి సాయంతోనే వంశీ నాలుగేళ్ల కిందట సీక్వెల్ కోసం స్క్రిప్టు సిద్ధం చేయించాడు.

అయితే యేళ్లు గడిచినా ఆ సినిమాకి హీరోలే సెట్ కాలేదు. కొన్ని రోజుల కిందట మళ్లీ స్క్రిప్టుపై రీవర్క్ చేయించారు. ఈమధ్యే సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అయితే సీక్వెల్ కోసం స్క్రిప్టు రాసిన తనికెళ్ల భరణికి మాత్రం కబురు లేదట. అసలేమైందా అని ఆరా తీస్తే భరణి తయారు చేసిన స్క్రిప్టుని పక్కనపెట్టేసి కొత్త స్క్రిప్టుని రాయించి దాంతోనే సినిమాని తీస్తున్నాడట వంశీ. ఆ విషయంలోనే తనికెళ్ల భరణి ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. ``ఒక సినిమా కోసం పని చేయించుకొన్నాక దానికి సంబంధించి మంచి చెడులేవైనా ఉంటే చెప్పాలి కదా మాట మాత్రం కూడా చెప్పకుండా స్క్రిప్టుని మార్చేయడం ఏం పద్ధతి`` అంటూ ఆయన తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడట. ఇటీవల మీడియా ముందు కూడా అదే విషయాన్ని ఇండైరెక్టుగా చెప్పారాయన. ``లేడీస్ టైలర్ సీక్వెల్కి కథ సిద్ధం చేసింది నేనే. కానీ ఆ సినిమా మొదలైంది. రచయితగా నాకు మాత్రం కబురు లేదు. దీన్నిబట్టి తెరకెక్కుతున్న కథ నాది కాదనే కదా అర్థం`` అన్నాడాయన.

,  ,  ,  ,  ,