తెలుగు సినిమాకు ఓ కమర్షియల్ పాయింట్ ఐటెమ్ సాంగ్. బీ, సీ సెంటర్లను ఊపేసేవి ఈ ఐటెమ్ సాంగులే. ఇక్కడో ఐటెమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. లొకేషన్ అన్నపూర్ణ స్టూడియో. బార్ సెట్లో పాటను షూట్ చేస్తున్నారు. ?రాప్ చిక్.. రాప్ చిక్.. తోడా తోడా భమ్ చిక్...? ఇదీ పల్లవి. ఐటెమ్ డ్యాన్సర్ ఫరా కరిమి, సైడ్ డ్యాన్సర్లతో కలసి అదిరిపోయే స్టెప్పులేస్తోంది. లేజర్ లైట్లు డ్యాన్సర్లపై జిగేల్మంటున్నాయి. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ వీళ్లకు స్టెప్స్ నేర్పుతున్నారు. మరోవైపు సినిమాటోగ్రాఫర్ గుహన్...సైడ్ ట్రాలీ వేసి కెమెరా యాంగిల్ చూసుకుంటున్నారు.
దర్శకుడు సునీల్ రెడ్డి చిత్రీకరణను మానిటర్లో గమనిస్తున్నారు. పైన బీరు తాగేందుకు వచ్చిన యువకుల్లా కొందరు జూనియర్ ఆర్టిస్టులు ఖాళీ సీసాలు పట్టుకుని నిల్చున్నారు. సెట్లో ఎఫెక్ట్ కోసం ఓ ముగ్గురు పొగ వేస్తున్నారు. సెట్ అసిస్టెంట్ పూర్ణ ఇదంతా సరిచూసుకుంటున్నాడు. అప్పుడే కార్వాన్లోంచి హీరో సాయిధరమ్ తేజ్ బయటకు దిగారు. పాటలో తన పార్ట్ కోసం వేచి చూస్తున్నారు.