Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Feb-2016 11:16:55
facebook Twitter Googleplus
Photo

ఊహించని స్వాగతం, ఊపిరిసలపనివ్వని అభిమానం. గత రెండు రోజులూ విజయవాడలో "వంగవీటి" సినిమా స్టడీ టూరులో భాగంగా ఆర్జీవీతో ఉండి చూసింది ఇదే. ఎయిర్ పోర్టులో దిగింది మొదలు, తిరిగి ప్లేన్ ఎక్కేవరకు ఒక మ్యారథాన్ లా జరిగింది. వందల కార్లు, బైకులు, వేలమంది అభిమానులు, పూలజల్లులు, టపాసులు, పోలీసుల బందోబస్తు, యూనీపోల్ కటౌట్లు, జైజై నినాదాలు. ఏమిటిదంతా? ఆర్జీవీ రాజకీయనాయకుడు కాదు, పెద్ద సినీ హీరో కాదు, పెద్దసినీ హీరోతో సూపర్ హిట్టులు తీసిన దర్శకుడూ కాదు. మరేమిటి ఈ ప్రభంజనం. అంతటికీ కారణం అందరూ కాన్షియస్ గా అనుకుంటున్నట్టు ఆర్జీవీ ఒక సినీ ప్రముఖుడు మాత్రమే కాదు. హీ ఈజ్ బియాండ్ సినిమా. సాధారణంగా ఒక గొప్ప వ్యక్తిని కలవబోతున్నప్పుడు ఉండే ఉద్విగ్నత, కలిసాక తగ్గుతుంది, కలుస్తూ ఉంటే పోతుంది. కానీ ఆర్జీవీతో ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత కూడా నాలో ఆ ఉద్విగ్నత ఎప్పటికప్పుడు కలుగుతూనే ఉంది.
"శివ" తీసినప్పుడు అప్పటి కాలేజీ విద్యార్థులు ఎంతెలా ఆయన ఫ్యాన్స్ అయ్యరో తెలిసిందే. వాళ్లంతా ఇప్పుడు మిడిల్ ఏజ్ కి వచ్చేసారు. వాళ్లందరీ కంప్లైంట్ ఒక్కటే. "శివ", "క్షణక్షణం" నాటి ఆర్జీవీ ఇప్పుడు లేడు, ఆ స్పార్క్ పోయింది అని. కానీ నిన్న మధ్యాహ్నం కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటిలో వేలాదిమంది విద్యార్థులు ఆర్జీవి పై కురిపించిన లవ్ చూసాక ఇది వ్రాయాలనిపించింది. వీళ్లందిరికీ "శివ", "క్షణక్షణం" పెద్దగా పట్టకపోవచ్చు. "సర్కార్" లాంటి సినిమా వచ్చినప్పుడు కూడా వాళ్లు స్కూల్ లో ఉండుంటారు. ఆర్జీవి ట్రెండ్ సెట్టింగ్ హిట్లు పెద్దగా వాళ్లకి పరిచయం లేకపోవచ్చు. అయినా సరే, నానా హంగామా మధ్య ఆయనకి ప్రేమరథం పట్టారు. వాళ్లడిగిన సరదా ప్రశ్నలకు, ఆర్జీవి ఇచ్చిన వెరైటీ సమాధానాలకు ఈలలు వేసి కేకలు పెట్టారు. ఆర్జీవీ హస్తముద్రలు టీ షర్ట్స్ పై వేయించుకున్నారు. ఆటొగ్రాఫ్ లు, సెల్ఫీలకు లెక్కలేదు. అరగంట కన్నా ఎక్కువ అక్కడ గడపకపోయినా ఆర్జీవికి ఏమో కానీ, ఆయన చుట్టూ ఉన్నవారికి మాత్రం ఆయన్ని తోపులటలు దాటించి జాగ్రత్తగా కార్ ఎక్కించే దాకా గుండె నార్మల్ గా కొట్టుకోలేదు. అంతటి విద్యార్థిజనవాహిని అది.
తన వ్యక్తిత్వం, తెలివి, తిక్క అన్నీ తన సినిమాకంటే ఎన్నో రెట్లు పెద్దవి కాబట్టే ఇలా 17-22 ఏజ్ గ్రూప్ ని పూర్తిగా రంజింపజేయడం సాధ్యమౌతోంది ఆర్జీవికి. ఎయిర్పోర్టు నుంచి కాన్వాయ్ లో స్వాగతం పలికినా, కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీలో ఉక్కిరిబిక్కిరి చేసినా అంతా ఆ ఏజ్ గ్రూప్ చేసిన పనే. మరో 20 ఏళ్ల తర్వాత వీళ్ళంతా మధ్య వయసుకు వచ్చి వేల్యూస్ మాట్లాడడం మొదలుపెట్టి "వంగవీటి" నాటి ఆర్జీవీ ఇప్పుడు లేడండీ అనడం, అప్పటి 17-22 ఏజ్ గ్రూప్ ఆ కాలానికి తగ్గట్టుగా తమ అభిమానాన్ని చూపించడం మామూలే అని చాలా ఈజీగా ఏ గ్రహాలు లెక్కేయకుండా జోస్యం చెప్పేయొచ్చు.
ఎందుకంటే ఆర్జీవీ పర్సనాలిటీ ఆ ఏజ్ గ్రూప్ కి ట్యూన్ అయ్యే విధంగా పర్మనెంట్ ఫ్రీక్వెన్సీ సెట్ అయిపోయింది. తరాలు మారినా అది మారదు. ఇది మారదు కనుక ఆర్జీవీ కీర్తిప్రభ ఆరదు.

-సిరాశ్రీ

,  ,