సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ?కబాలి? సినిమా ప్రస్తుతం సౌతిండియాలో హాట్ టాపిక్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. కాగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం ఇంకా అయోమయం నెలకొంది. మొదట జూలై 15న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న ప్రచారం జరగ్గా, చివరినిమిషంలో జూలై 22కు వాయిదా పడింది.
ఇక జూలై 22న కూడా సినిమా విడుదలవ్వదని, తాజాగా జూలై 29న సినిమాను విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు కొత్త ప్రచారం మొదలైంది. దీంతో కబాలి రిలీజ్ ఎప్పుడన్నది ప్రస్తుతానికి సస్పెన్సే! ఇక ఇదే విషయమై టీమ్ నుంచి అందుతోన్న సమాచారాన్ని బట్టిచూస్తే సెన్సార్ అయ్యాకే టీమ్ విడుదల తేదీని ప్రకటిస్తుందని తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి ?కబాలి? సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. సెన్సార్ అయిపోయిన వెంటనే టీమ్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనుంది. దీన్నిబట్టి మరో రెండు రోజుల్లో కబాలి విడుదల తేదీ సస్పెన్స్‌కు తెరపడుతుందని ఆశించొచ్చు. కళైపులి థాను నిర్మించిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించారు.