Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Aug-2015 13:07:03
facebook Twitter Googleplus
Photo

టిక్కెట్ ని బ్లాక్ చేయడం బ్లాక్ మార్కెటింగ్ చేయడం ఇవన్నీ అనాదిగా నడుస్తున్న వ్యవహారమే. అయితే మల్టీప్లెక్స్ కల్చర్ పెరిగాక .. సామాన్య జనాలకు వాతలు పెట్టే రేంజుకి ఇది విస్తరించింది. మామూలు థియేటర్ లో టిక్కెట్టు సైతం రూ.500 వెచ్చించి బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి. బెనిఫిట్ షోలకు రూ.1500 పెట్టాల్సిందే. మధ్యస్థంగా 1000 కి టిక్కెట్ దొరకడం గగనమే అయిపోతోంది.

ఇటీవలి కాలంలో టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన బాహుబలి టిక్కెట్టు కోసం రూ.3000 నుంచి రూ.5000 చెల్లించుకున్నారని వార్తలొచ్చాయి. పంపిణీదారులు స్వయంగా టిక్కెట్లను బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్మించారని పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మల్టీప్లెక్సులు అనే తేడా లేకుండా ఈ దందా యథేచ్ఛగా సాగిపోయింది. ఇప్పుడు అదే తరహాలో శ్రీమంతుడు టిక్కెట్లు కూడా విక్రయిస్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమా బెనిఫిట్ షో టిక్కెట్ రూ.1500. మామూలుగా మల్టీప్లెక్స్ ల్లో చూడాలనుకుంటే రూ.500 నుంచి రూ.1000 చెల్లించుకోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్ లో గోకుల్ సత్యం శ్రీరాములు వంటి థియేటర్లు మూడు రోజుల పాటు బుకింగ్ ఓపెన్ చేయలేని పరిస్థితి.

కేవలం తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించడం ద్వారా బడ్జెట్ ని రికవరీ చేయాలన్న ఆత్రంలోనే పంపిణీదారులంతా ఈ టిక్కెట్ దందాకి తెరలేపాల్సొచ్చిందని సమర్ధించుకుంటున్నారు. పైగా నైజాంలో హక్కుల కోసం రూ.14కోట్లు భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది అభిషేక్ పిక్చర్స్. ఆ సొమ్ముల్ని రికవరీ చేయాలంటే ఆ మాత్రం తప్పదు .. అని అనుకుంటున్నారంతా. పెరిగిన బడ్జెట్ లు పంపిణీ భారం తిరిగి రికవరీ అవ్వాలంటే ఇది తప్పనిసరి పరిస్థితి అయిపోయిందని చెప్పుకుంటున్నారు.

అయితే ఇది సామాన్యుడి నడ్డి విరిచేదే. క్రేజు ను క్యాష్ చేసుకోవాలనుకోవడం వల్ల కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్లి చూడలేని పరిస్థితి. రేపే శ్రీమంతుడు రిలీజ్ అవుతోంది.

,  ,  ,