సినిమాకు టాక్ అయితే బాగానే వచ్చింది. వీకెండ్లో ఓవరాల్ వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. మంచి టైమింగ్ లో రిలీజవడం ఈ చిత్రానికి కలిసొచ్చింది. నాని సినిమా నిన్ను కోరి జోరు తగ్గిపోగా.. ముందు వారం వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ పరీక్షకు నిలవలేకపోయాయి. దీంతో వీకెండ్ వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఇంకా వసూళ్లు పెరగాల్సింది. ఐతే క్లాస్ సెంటర్లలో వసూళ్లు బాగున్నప్పటికీ బి-సి సెంటర్లలో పరిస్థితి అంత బాగా ఏమీ లేదు. పూర్తిగా క్లాస్ టచ్ ఉన్న సినిమా కావడంతో మాస్ సెంటర్లలో వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు.
వీకెండ్ వరకు బి-సి సెంటర్లలో ఫిదా వసూళ్లు ఓకే అనిపించాయి కానీ.. ఆ తర్వాత మాత్రం డల్లయిపోయాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మాస్ ఏరియాల్లో సోమవారం ఫిదా వసూళ్లు నామమాత్రంగా ఉన్నాయి. ఈ సినిమా సెకండాఫ్ విషయంలో మాస్ ప్రేక్షకుల నుంచి ముందే నెగెటివ్ టాక్ వచ్చింది. సినిమా మరీ నెమ్మదిగా ఉందని.. మరీ సాగదీశారని విమర్శలు వ్యక్తమయ్యాయి. క్లాస్ ఆడియన్స్ సెకండాఫ్ తో సర్దుకుపోతారు కానీ. మాస్ ప్రేక్షకులు సినిమా అలా నత్తనడకన సాగితే ఇబ్బంది పడతారు. శేఖర్ కమ్ముల సినిమాలు మామూలుగానే బి-సి సెంటర్ల ప్రేక్షకులకు అంతగా ఎక్కవు. ఫిదా కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కాకపోతే ఫస్టాఫ్ లో ఎంటర్టైన్మెంట్ వరకు ఆ వర్గం ప్రేక్షకులు కూడా కొంతమేర కనెక్టయ్యారు.