సంక్రాంతికి మించిన సీజన్ లేదు. అప్పుడొచ్చే సినిమాలకు మంచి వసూళ్లుంటాయి. మామూలు సీజన్లలో కంటే అప్పుడు రిలీజ్ చేస్తే సినిమాలు మెరుగైన ఫలితాలు అందుకుంటాయి. సంక్రాంతికి మూణ్నాలుగు పేరున్న సినిమాల్ని ఒకేసారి రిలీజ్ చేసినా అన్నింటికీ మంచి వసూళ్లు వస్తాయి. అందుకే ప్రతి హీరో కూడా సంక్రాంతికి తన సినిమా విడుదల కావాలని కోరుకుంటారు. ఇక స్టార్ల సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. ఐతే రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం తాను పూర్తి స్థాయి హీరోగా నటించిన ఒక్క సినిమాను కూడా సంక్రాంతి రేసులో నిలపలేదంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఇంతకుముందు పవన్ సినిమాలు సుస్వాగతం.. బాలు జనవరి మొదటి వారంలో రిలీజయ్యాయి కానీ.. కానీ సరిగ్గా సంక్రాంతికి రాలేదు. వాటిని సంక్రాంతి సినిమాలు అనలేం. ఇక కొన్నేళ్ల కిందట పవన్ నటించిన గోపాల గోపాల సంక్రాంతికే రిలీజైంది కానీ.. అందులో పవన్ హీరో కాదు. అతిథి పాత్ర మాత్రమే చేశాడు. దాన్ని పవన్ సినిమా అనలేం. ఈ నేపథ్యంలో పవన్ హీరోగా నటిస్తూ సంక్రాంతికి రాబోతున్న తొలి సినిమా అజ్ఞాతవాసి అనే చెప్పాలి. నిజానికి ఈ చిత్రం కూడా సంక్రాంతికి రావాల్సింది కాదు. దీన్ని ముందు దసరాకు అనుకున్నారు. కానీ కొంచెం ఆలస్యమై సంక్రాంతి రేసులో నిలిచింది.