బాహుబలి: ది బిగినింగ్ తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. మొత్తం ఇండియన్ సినిమాకే అది సవాలు విసిరింది. అన్ని రకాలుగా సరికొత్త రికార్డులకు తెరతీసింది. బాహుబలి: ది కంక్లూజన్ కూడా ఇప్పటిదాకా ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసి కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందనడంలో సందేహం లేదు. ఐతే బాహుబలి లాంటి స్పెషల్ మూవీని పక్కనబెట్టేసినా.. వేరే తెలుగు సినిమాలు కూడా సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. బాలీవుడ్ సినిమాలకు మాత్రమే సాధ్యమైన రికార్డుల్ని సొంతం చేసుకుంటున్నాయి. గత నెలలో రిలీజైన కాటమరాయుడు టీజర్ ఆరంభం నుంచి ఎలా జోరు చూపిస్తోందో తెలిసిందే.
ఆల్రెడీ టాలీవుడ్ టీజర్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసిన కాటమరాయుడు ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించాడు. టాలీవుడ్ చరిత్రలోనే కోటి వ్యూస్ తెచ్చుకున్న తొలి టీజర్ గా కాటమరాయుడు రికార్డు సృష్టించింది. రిలీజైన నెల రోజుల తర్వాత ఈ టీజర్ ఈ మైలురాయిని అందుకుంది. ఈ టీజర్ వచ్చిన రెండు వారాలకే ఖైదీ నెంబర్ 150 టీజర్ పేరిట ఉన్న హైయెస్ట్ వ్యూస్ రికార్డును బద్దలు కొట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా 10 మిలియన్ మార్కు వైపు అడుగులు వేసింది. ఈ టీజర్ లైకుల విషయంలోనూ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ టీజర్ వచ్చే సమయానికి లక్ష లైకులు కొట్టించుకున్న టీజర్ కూడా ఏదీ లేదు.