Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2017 13:11:04
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ నటనా కౌశలం గురించి కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అద్భుత పాత్రల్ని గొప్పగా పండించారాయన. వాటిలో చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ప్రతినాయక ఛాయలున్న పాత్రలు. అవన్నీ కూడా పౌరాణిక పాత్రలే కావడం విశేషం. భూ కైలాస్ లో రావణబ్రహ్మగా కళ్లు చెదిరే అభినయాన్ని చూపించినా.. దాన వీర శూర కర్ణ లో దుర్యోధనుడిగా నట విశ్వరూపం చూపినా.. అది ఆయనకే చెల్లింది. ఆ పాత్రల్ని పోషించడంలో ఆయనకు ఆయనే సాటి. చరిత్రలో విలన్ ముద్రతో నిలిచినపోయిన ఈ పాత్రల్ని హీరోల్ని చేసిన ఘనత ఆయనదే. నెగెటివ్ ఛాయలున్న పాత్రల్లో ఉండే మజాను తెలుగు ప్రేక్షకులకు తెలియజెప్పిన ఘనుడు ఎన్టీఆర్.

ఇప్పుడు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఎన్టీఆర్ ప్రతినాయక ఛాయలున్న పాత్రను చేస్తున్నాడు జై లవకుశ లో. అప్పుడు ఎన్టీఆర్ రావణ పాత్రను అద్భుతంగా పోషించి మెప్పిస్తే.. ఇప్పుడు రావణ ఛాయలున్న పాత్రతో ఎన్టీఆర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ముందు జై లవకుశ మీద పెద్దగా అంచనాలు లేవు కానీ.. జై టీజర్ చూశాక ఒక్కసారిగా ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. మామూలుగానే మంచి నటుడిగా పేరున్న తారక్.. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో చెలరేగిపోయి ఉంటాడని భావిస్తున్నారు. పెద్ద ఎన్టీఆర్ తర్వాత.. చిన్న ఎన్టీఆర్ కంటే ముందు నందమూరి ఫ్యామిలీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేసిన హీరోలు లేకపోలేదు.

నందమూరి బాలకృష్ణ సైతం ఓ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేశాడు. అదే.. సుల్తాన్. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. టైటిల్ రోల్ చాలా వరకు నెగెటివ్ షేడ్స్తోనే ఉంటుంది. ఈ సినిమా అంతగా ఆడకపోయినా బాలయ్య పాత్ర.. ఆయన అభినయం ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఇక ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ హరేరామ్ సినిమాలో చేసిన రెండు పాత్రల్లో ఒకటి నెగెటివ్ క్యారెక్టర్. సొంత తమ్ముడి మీదే పగ పెంచుకుని శాడిస్టులా ప్రవర్తించే పాత్ర అది. చివర్లో మంచిగా మారినప్పటికీ.. చాలా వరకు నెగెటివ్ షేడ్స్ తోనే సాగుతుందా పాత్ర. మరో నందమూరి హీరో తారకరత్న హీరోగా సక్సెస్ కాలేక.. అమరావతి రాజా చెయ్యి వేస్తే సినిమాల్లో పూర్తి స్థాయి విలన్ క్యారెక్టర్లు చేశాడు. ఇప్పుడిక జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ లో ప్రతినాయక ఛాయలున్న జై పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

,  ,  ,  ,  ,