Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jul-2017 14:19:44
facebook Twitter Googleplus
Photo

రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హైదరాబాదులో పట్టుబడ్డ డ్రగ్స్ రాకెట్... అందులో తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్కు చెందిన ప్రముఖులకు పాత్ర ఉందంటూ వస్తున్న కథనాలపైనే చర్చ జరుగుతోంది. ఈ డ్రగ్స్ దందాకు సంబంధించి విచారణ మొదలెట్టిన సిట్... తొలుత టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను విచారణకు పిలిచింది. సుదీర్ఘంగా 11 గంటల పాటు ఆయనను విచారించింది. విచారణ తర్వాత పూరీ ఇంటికెళ్లిపోయారు. ఈ దందాలో తొలి నుంచి తన పేరు వినిపిస్తున్నా... నోరు విప్పని పూరీ విచారణ తర్వాత మాత్రం చాలా ఆవేదనతో కూడా సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజాలు తెలుసుకోకుండా తనపై మీడియా మిత్రులు తప్పుడు కథనాలు రాశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో నిన్న ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మొత్తం ఎపిసోడ్ పై కూలంకషంగా మాట్లాడారు. తన కుటుంబ సభ్యులు - టాలీవుడ్ ప్రముఖులు - అభిమానులు తనకు అందించిన బాసటను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాకుండా ఈ దందాలో తనకెలాంటి పాత్ర లేదని చెబుతూనే... సినిమా నిర్మాణంలో భాగంగా తాను వ్యవహరిస్తున్న తీరును కూడా సుస్పష్టం చేశారు. విదేశాలకు వెళుతున్న తన వైఖరిని తప్పుబట్టే వారి తప్పుడు భావనపైనా ఆయన తనదైన శైలిలో కామెంట్లు చేశారు. జీవితంలో తాను ఈ తరహా టర్న్ ఉంటుందని భావించలేదని చెప్పిన పూరీ... ఈ దందాలో తన పేరు బయటకు రావడం పట్ల తన కుటుంబం ఎంత నరకం అనుభవించిందో కళ్లకు కట్టినట్లుగా చెప్పారు. ఇంటర్వ్యూకు ఓకే చెప్పిన పూరీ గొంతు ప్రారంభంలో అసలు పెగలడానికే ఇబ్బంది పడిందట. అయితే ఆ తర్వాత తమాయించుకుని ఆ ఇంటర్వ్యూలో పూరీ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే...

* మా అమ్మ అంత ఈజీగా డీలా పడదు. అలాంటిది ఏంటిరా ఇది... అని నేను గురువారం పొద్దున ఫోన్ చేయగానే బేలగా అడిగింది. సిట్ విచారణ లో ఉండటం వల్ల బుధవారం ఆవిడకి ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేశాక - అసలేం మాట్లాడకుండా ఏడవటం మొదలు పెట్టింది. కాసేపటికి తేరుకుని టీవీ చూస్తూ కూర్చున్నానని చాలా బాధ అనిపించిందని చెప్పింది. అమ్మ అంత డీలా పడిపోవడం ఇదే ఫస్ట్ టైమ్. సరే.. నేనంటే తట్టుకున్నాను. కానీ ఇంట్లోవాళ్లు ఎలా తట్టుకుంటారు?

* ఈ ఘటన నాకు నిజంగా షాకే. నాతో పాటు నాక్కావల్సినవాళ్లందరికీ షాకే. లైఫ్ లో ఇలాంటి టర్న్ ఉంటుందని ఊహించలేదు. ఇలా అవుతుందనీ.. ఇంత న్యూసెన్స్ అవుతుందనీ అనుకోలేదు. నాకే కాదు. నా ఫ్యామిలీకి నా సన్నిహితులకీ కూడా ఇబ్బందే. ఇలా జరగడం చాలా బాధగా అనిపించింది. మనం ఏంటి? మనం చేస్తున్న పనేంటి? మన మీద వచ్చిన ఆరోపణలు ఏంటి? ఈ నిందలు ఏంటి? అని ఆలోచనలో పడ్డాను. నిజానికి నా లైఫ్ లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. అందుకని తట్టుకోగలుగుతున్నాను. కానీ మా అమ్మ - వైఫ్ - పిల్లలు - నా తమ్ముళ్లు.. వీళ్లంతా షేక్ అయిపోయారు.

* కెల్విన్ నాతో ఫొటో దిగాడంటున్నారు. వందల మంది నాతో ఫొటోలు దిగుతుంటారు. నా షూటింగ్ స్పాట్ కి వస్తుంటారు. ఫొటో దిగాలంటారు. లేకపోతే నేను బయట ఎక్కడైనా కనిపిస్తే ఫొటోలు దిగుతామంటూ రిక్వెస్ట్ చేస్తారు. నేనెవర్నీ కాదనను. ఫొటో దిగేటప్పుడు దాదాపు వాళ్ల భుజం మీద చేయి వేసి దిగటం అలవాటు. నా ఫొటోలు చూస్తే ఎవరితో అయినా నేను క్లోజ్ గా ఉన్నట్లుగానే ఉంటాయి. వాటిని చూసి అవే ఆధారాలు అనుకుంటారేమో. పోకిరి సినిమాలో ‘నేను దొరికితే.. చిరంజీవితో ఫొటో ఉంది. రజనీకాంత్ తో ఫొటో ఉంది. అమితాబ్ తో ఫొటో ఉంది. అవి చూపిస్తా... వారికి నాతో లింక్ ఉందో లేదో తెలుసుకోవడానికి మీకు పదేళ్లు పడుతుంది. ఏం పీకుతార్రా’ అనే డైలాగ్ రాశా. ఆ డైలాగ్ నా మీదే వచ్చింది.

* నా సినిమాల్లో ఎక్కువగా పోలీసాఫీసర్లను హీరోలుగా చూపించా.. శివమణి - పోకిరి - గోలీమార్ - టెంపర్ - ఇలా అన్నీ డిపార్ట్ మెంట్ ని హైలైట్ చేస్తూ తీసిన సినిమాలే. అయినా చెప్పాల్సినవన్నీ నేను అధికారులకు చెప్పాను. మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసినంత మాత్రాన నాకు మాఫియాతో సంబంధం ఉన్నట్లు కాదు. సినిమాల్లో విలన్లు పూజలు చేస్తున్నట్లు చూపించలేం. క్లబ్ లో తాగుతూనో మర్డర్ చేస్తున్నట్లో చూపించాల్సి వస్తుంది. అప్పుడే ప్రేక్షకులు చూస్తారు. హీరోలాగే విలన్ కూడా గుడికి వెళ్లి పూజలు - భజనలు చేస్తే చూడ్డానికి బాగుంటుందా?

* సిట్ అధికారులు చాలా డీసెంట్గా అడిగారు. నేనూ సమాధానాలు చెప్పాను. ఒక ఇష్యూ గురించి ఇంటరాగేషన్ జరుగుతున్నప్పుడు దాని గురించి ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇవ్వకూడదు. ఆ విషయాలు బయటకు చెప్పకూడదు. అందుకే ఈ విషయాల గురించి ఇప్పుడు నేనెక్కువగా మాట్లాడలేను.

* నేనేమీ డ్రగ్స్ కు అడిక్ట్ కాలేదు. అసలు డ్రగ్సే వాడను. ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లల్లో డైరెక్టర్లు ఉన్నారు. వాళ్లు అంతగా పబ్ లకు వెళ్లరు. నేను కూడా గత నాలుగేళ్ళలో మూడు నాలుగు సార్లు మాత్రమే వెళ్లాను. అసలు పబ్ కి వెళ్లే టైమ్ నాకు ఉండదు. నా తోటి డైరెక్టర్లు ఒక సినిమా చేసేలోపు నేను మూడు సినిమాలు చేస్తుంటాను. ఐదారు గంటలకన్నా ఎక్కువగా పడుకోను. ఎందుకంటే నాకు నిద్రపోయే టైమ్ ఉండదు. ఒకవేళ నేను డ్రగ్స్ కి ఎడిక్ట్ అయ్యుంటే ఇన్ని సినిమాలు ఎలా చేయగలుగుతాను? స్టోరీ–స్క్రీన్ ప్లే–డైలాగ్స్–డైరెక్షన్–ప్రొడక్షన్ అన్నీ నేనే. లైఫ్ లో చాలా జరుగుతుంటాయి. సమాజం ఒక వ్యక్తి మీద దొంగ అని ముద్ర వేస్తే.. అదే నిజమనుకుంటారు. హీరో అని అంటే.. ఆ ఇమేజే పడుతుంది. నిజాలు నిలకడగా తెలుస్తాయి.

* స్కూలు పిల్లలు డ్రగ్స్ కు అలవాటు పడుతుండటం నిజంగా బాధ కలిగిస్తోంది. ఏడేళ్ల క్రితం నా ఆఫీసుకి ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో పదో తరగతి పిల్లలు కొంతమంది మీ ఫ్యాన్స్ అంటూ వచ్చారు. ఫొటోలు దిగుతామన్నారు. సరేనన్నా. వచ్చీ రాగానే ఒక్కొక్కరూ బాటిల్స్ మీద బాటిల్స్ మంచి నీళ్లు తాగారు. ఇలా తాగుతున్నారేంటి? అని ఆశ్చర్యపోయాను. ఇలా కూర్చోండి అనేలోపే వాళ్లు సోఫాలో పడిపోయారు. జనరల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లెవరైనా.. వాళ్లు డ్రగ్స్ తీసుకున్న విషయాన్ని ఊహించేస్తారు. ఆ పిల్లలెవరో - ఏ స్కూల్ కి చెందినవాళ్లో నాకు తెలియదు. తెలిసిన పోలీసాఫీసర్ కి విషయం చెప్పి - షూటింగ్ ఉండటంతో వాళ్లకేం కావాలో చూడమని మా ఆఫీస్ స్టాఫ్ కి చెప్పి వెళ్లిపోయాను. సాయంత్రం నాలుగున్నరకి వాళ్లు లేచి - వెళ్లిపోయారని మా స్టాప్ లో ఒకతను ఫోన్ చేసి చెప్పాడు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలి. వాళ్లేం చేస్తున్నారో గమనించాలి. లేకపోతే ఇలాంటివే జరుగుతాయి. చదువుకుని - పైకి రావాల్సిన పిల్లలు ఇలా పాడైపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? వాళ్లనే కాదు.. మన పిల్లలు కాకపోయినా మనకూ బాధగానే ఉంటుంది.

* మా పిల్లలను మా ఆవిడ చాలా పద్ధతిగా పెంచింది. చాలామంది మీ పిల్లల ప్రవర్తన బాగుంటుందని అంటుంటారు. వాళ్లు తప్పుడు దారిలో లేరు. నా పిల్లలు కన్నా తక్కువ వయసులో ఉన్నవాళ్లల్లో కొందరు పెడదారి పడుతున్నారు. ఆ పిల్లలది తప్పనడం లేదు. వారికి ఎవరో అలవాటు చేసి పెడదారి పట్టిస్తున్నారు. అలాంటివాళ్ల బారిన పడకుండా కాపాడుకోవాలి.

* ‘సిట్ కు అందిన సమాచారం మేరకు నన్ను పిలిచారు. నేను వెళ్లి వారిని కలిసేలోపు .. నేను నిజంగా డ్రగ్స్ అమ్ముతున్నానని ఒకరు ఢిల్లీలో వ్యభిచార గృహం నడుపుతున్నానని మరొకరు థాయిలాండ్ లో వ్యభిచారం మేనేజ్ మెంట్ లో దొరికిపోతే నా పాస్ పోర్ట్ లు సీజ్ చేశారని మరొకరు.. ఇలా రకరకాల స్టోరీలు. నాకర్థం కాని విషయం ఏంటంటే డైరెక్టర్ గా నేను కోట్లు సంపాదిస్తున్నప్పుడు ఇలాంటి పనులు చేసి సంపాదించాల్సిన అవసరం నాకేంటి? ఇలాంటి దుష్ప్రచారానికి కారణం శత్రువుల ద్వారానే జరుగుతుందని అనుకుంటారు. అలాగే నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అని సిట్ అధికారులు కూడా అడిగారు. నాకు తెలిసి నాకెవరూ లేరు. తెలియని శత్రువులు టార్గెట్ చేశారేమో. నా గురించి నేను ఆలోచించుకోవడానికే నాకు టైమ్ లేదు.

* ఎంజాయ్ మెంట్ కోసం బ్యాంకాక్ వెళ్లడం లేదు. అసలు విషయం తెలియనివాళ్లు డ్రగ్స్ కోసమే అనుకుంటారు. బ్యాంకాక్ బీచ్ లో మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చుని ఎంతో ఫోకస్ చేస్తే కానీ ఆరు నెలల్లో చేసే పని (స్క్రిప్ట్ - డైలాగ్స్ రాయడం)ని నేను 15 రోజుల్లో చేయలేను మరి. నాకు తెలిసి ఇండియాలో ఉంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఫ్రెండ్స్ కలుస్తుంటారు. సినిమాల డిస్కషన్ అంటూ వస్తుంటారు. ఫుల్ గా కాన్ సన్ ట్రేట్ చేయడానికి కుదరదు. ఇదంతా తెలియక నేను బ్యాంకాక్ కి వెళుతున్నానంటే అందరికీ ఎంజాయ్ మెంట్ గుర్తొస్తుంది. మసాజుల కోసమే వెళతాననుకుంటారు. నాకు పదిహేనేళ్లుగా ఒకే ఆవిడ మసాజ్ చేస్తున్నారు. ఆవిడ వయసు 55 ఏళ్లు. బ్యాంకాక్ కి నేను ఒంటరిగా వెళ్లను. ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంటారు. ఆవిడ నా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా క్లోజ్.

* అసలు బ్యాంకాక్ వెళ్లడం కారణంగా ఈ తరహా ఆరోపణలు వస్తాయని ఊహించలేదు. ఎదుటి వ్యక్తి చూసే కళ్లను బట్టే ఏదైనా ఉంటుంది. మనల్ని కరెక్ట్గా చూస్తే.. కరెక్ట్ గా చెడుగా చూస్తే అలానే కనిపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్.. నేను బ్యాంకాక్ కి వెళ్లిన ప్రతిసారీ ఓ పోలీసాఫీసర్ ఎయిర్ పోర్ట్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటారు. ఆవిడకు ఫార్టీ ఇయర్స్ పైనే ఉంటాయి. లావుగా ఉంటారు. ఎప్పుడూ యూనిఫామ్ లో వచ్చేవారు. ఓసారి మాత్రం మామూలు డ్రెస్ లో వచ్చారు. నేను ల్యాండ్ అవ్వగానే హాయ్ పూరీ.. అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి రిసీవ్ చేసుకున్నారు. అక్కడే ఉన్న వ్యక్తి పూరీగారూ.. మీ టేస్ట్ బాగాలేదు. అమ్మాయిని మార్చేయండి అన్నాడు. అంటే.. ఆ వ్యక్తి ఊహ వేరే విధంగా ఉంది. నిజానికి ఆవిడ నాతో ఆత్మీయంగా ఉంటారు. నాకూ వేరే దృష్టి లేదు. కానీ ఆ వ్యక్తి చెడుగా ఊహించుకున్నాడు. ఏం చేయగలుగుతాం.

* ఈ తరహా ఆరోపణలతో ఇమేజ్ డౌన్ అవుతుందా? అని ఆలోచించలేదు. ఎవరూ లేకుండా ఇండస్ట్రీలో కష్టాలు పడినప్పుడు ఆ తర్వాత పైకి ఎదిగి ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు... ఇలా జీవితంలో చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను. ఇది కూడా ఓ డౌన్ ఫాల్. జీవితంలో ఊహించనివి జరుగుతుంటాయి. వాటిని అనుసరిస్తూ వెళ్లిపోవాలంతే.

* నా కాల్ లిస్ట్ చూస్తే తెలుస్తుంది. బేసిక్ గా నాకు తెలియని నంబర్ల నుంచి ఫోన్ వస్తే నేను తీయను. ఒకవేళ వాళ్లు మేం ఫలానా అని మెసేజ్ పెడితే ఫోన్ చేసి మాట్లాడతాను. ఫోన్లో నా ఫేవరెట్ నంబర్స్ 20 మాత్రమే ఉంటాయి. అందులో నా ఫ్యామిలీ మెంబర్స్ నేను అప్పుడు సినిమా చేసే టీమ్ నంబర్స్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ట్రై చేసినా మిస్డ్ కాల్ ఉంటుంది. నాకు తెలియనివాళ్లు చేస్తే నేను తీయను.

* డ్రగ్స్ తీసకున్నవారిలో మిగతావాళ్లు ఉన్నారా? లేదా? అనేది పక్కన పెట్టేద్దాం. జనరల్ గా అన్ని ఇమేజ్ లూ సినిమా ఇండస్ట్రీ మీదే పడతాయి. మంచైనా.. చెడైనా... ఏదైనా సినిమా ఇండస్ట్రీకి ఆపాదించేస్తారు. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే ఓ క్రేజ్ ఉంటుంది. అందుకే ఈజీగా ఇక్కడివాళ్ల గురించి మాట్లాడేస్తారు. ఇండియాలో జింకను కాల్చింది ఎవరంటే సల్మాన్ ఖాన్ అని చెప్పేస్తారు. కానీ ఈ సంఘటన తర్వాత చాలా జింకలు చనిపోయి ఉండొచ్చు. అయితే వాటి గురించి ఎవరూ మాట్లాడరు. సినిమావాళ్లే హైలైట్ అవుతుంటారు. సినిమాల ప్రభావం సమాజం మీద ఉంటుంది. ఫ్యాన్స్ సెలబ్రిటీలను ఫాలో అవుతారు. వాళ్ళ మాటలను సీరియస్గా తీసుకుంటారు. అందుకే సినిమావాళ్లు ఆచితూచి మాట్లాడాలని నా ఒపీనియన్.

* ఈ ఘటనతో మీడియాపై నా వైఖరేమీ మారదు. అయినా ఏం మారాలి? మీ జీవితంలో జరిగిన సంఘటనలతో సినిమా తీస్తారా? అనడిగితే... ఈ సంఘటనలు అని కాదు. ఇలాంటివి వంద సమస్యలతో జనగణమణ అనే స్క్రిప్ట్ తయారు చేస్తున్నా. దేశం మీద అభిమానం ప్రేమ ఉండబట్టే ఈ కథ రాస్తున్నా. జనగణమణ నా లైఫ్ యాంబిషన్. ఎవరైతే నాపై ఆరోపణలు చేస్తున్నారో వాళ్లందరూ ఈ స్క్రిప్ట్ రాయలేరు. ఈ సినిమా నేను తీస్తాను. ప్రేక్షకులు చూస్తారు. ఐ లవ్ ఇండియా... ఐ హేట్ ఇండియన్స్ అనేది సినిమా ట్యాగ్ లైన్. ఇలా ఎందుకు పెట్టాననేది సినిమా చూస్తే అర్థమవుతుంది.

* అన్ని వర్గాల నుంచి నాకు సపోర్ట్ అందింది. అధికారులు నన్ను విచారిస్తున్నప్పుడు బాలకృష్ణగారు నా ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి - ధైర్యం చెప్పారు. అంత పెద్ద హీరోకి అవసరం లేదు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారని ఆయన ఊహించి మావాళ్లతో మాట్లాడారు. ఇంకా మోహన్ బాబుగారు వియ్ లవ్ యు. నీకేం కాదు అనీ సురేశ్ బాబుగారు యు ఆర్ రెబల్. బీ స్ట్రాంగ్ అనీ - ప్రభాస్ డార్లింగ్.. ఏంటి మనకీ కష్టాలు. ధైర్యంగా ఉండు అనీ అన్నారు. వరుణ్ తేజ్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. చాలామంది జర్నలిస్టులు మెసేజ్ లు పెట్టారు.

* నా వైఫ్ లావణ్య ఏడుస్తూనే ఉంది. ఆరేడు రోజులుగా నా గురించి ఒకటే న్యూసులు కదా. టీవీల్లో వస్తున్న ఆ న్యూస్ లు చూసి - ఫోన్ చేసేది. నేనేమో షూటింగ్లో బిజీగా ఉండేవాణ్ణి. నువ్వు అర్జంటుగా టీవీ ఆఫ్ చెయ్ అనేవాణ్ణి. అయినా టీవీ ఆఫ్ చేయకుండా న్యూస్ చూడటం - అప్పుడప్పుడూ ఫోన్ చేయడం. నేను ఇంటికి వచ్చేసరికి నా భార్య - కొడుకు ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ కూర్చోవడం చూసి చాలా బాధపడ్డాను. ఇద్దరి కళ్లూ ఎర్రబడిపోయాయి. బుధవారం ‘సిట్’ విచారణకు వెళ్లినప్పుడు నాతో పాటు నా తమ్ముడు సాయి - నా కొడుకు ఆకాష్ కూడా వచ్చారు. నా వైఫ్ అయితే ఇంట్లో పూజలు చేస్తూ కూర్చుంది.

* ఫ్యామిలీ వైజ్ గా ఐయామ్ బ్లెస్డ్ ఫ్యాన్స్ గురించి కూడా చెప్పాలి. విచారణలో ఉన్నప్పుడు గేట్ దగ్గరే ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఉన్నారు. వాళ్లు ఇచ్చిన సపోర్ట్ ను మర్చిపోలేను. కొందరు సోషల్ మీడియాలో కూడా నాకు మద్దతు తెలిపారు. ఆ పోస్ట్లన్నింటినీ నేను చదివాను. చాలా సంతోషంగా అనిపించింది. నన్ను సపోర్ట్ చేసిన అభిమానులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక అమ్మాయి అయితే సోషల్ మీడియాలో నువ్వు డ్రగ్స్ వాడినా ఫర్వాలేదు.. ఐ లవ్ యు అని మెసేజ్ పెట్టింది. ఇంకా చాలామంది ఫ్యాన్స్ పూరీ అన్నయ్యా.. చాలా బాధగా ఉంది’ అని స్పందించడం చూసి ఐయామ్ బ్లెస్డ్ అనిపించింది.

* నేను ప్రస్తుతం తీస్తున్న పైసా వసూల్ కి తను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తోంది. ఈ షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లినా చెన్నై వెళ్లినా.. ఇంకెక్కడికి వెళ్లినా తను నాతో పాటే ఉంటుంది. నేను డ్రగ్స్ తీసుకుంటున్నానా? లేదా అనేది తనకు బాగా తెలుసు. లేని విషయం గురించి ఆరోపిస్తున్నారు కాబట్టే బాధ పడింది. అందుకే ‘ఫేస్ బుక్’లో అలా రియాక్ట్ అయింది.

,  ,  ,  ,  ,