చేసిన సినిమాలు.. అందులో సక్సెస్ లు ప్రకారం చూస్తే.. కొత్త కుర్రాడు రాజ్ తరుణ్ కి విజయాలు ఎక్కువే. మొదటి మూడు సినిమాలతో హిట్ లు కొట్టి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాక.. ఈ ఏడాది ప్రారంభంలో ఇతగాడికి మొదటి షాక్ తగలింది. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫెయిల్యూర్ కావడంతో.. మళ్లీ సక్సెస్ వెతుక్కోవాల్సిన పని పడింది. అయితే.. యాక్టింగ్ ట్యాలెంట్ - సక్సెస్ రేట్ కారణంగా ఆఫర్లు బాగానే క్యూ కట్టాయి.
కానీ రాజ్ తరుణ్ యాటిట్యూడ్ కారణంగా వరుసగా ఆఫర్లు వెనక్కి వెళ్లిపోయాయి. ఈ హీరో డిమాండ్స్ పెరిగిపోవడం స్క్రిప్ట్ రైటింగ్ తో సహా అన్నింటిలోనూ తన చెయ్యి ఉండాలనడం ప్రతీ విషయంలో వేలు పెడుతుండడంతో.. భారీ నిర్మాణ సంస్థల ఆఫర్లు చేజారాయి. ఇతనితో అనుకున్న ప్రాజెక్టుల్లోకి వేరే హీరోలను తీసుకుని సినిమాలు తీసేసుకుంటున్నారు. ఇక ఈ యంగ్ హీరోకి బ్యాడ్ టైం మొదలైందనే కామెంట్స్ వినిపించాయి. అయితే.. మంచు విష్ణుతో చేసిన మల్టీ స్టారర్ ఆడో రకం ఈడో రకంతో మళ్లీ విజయం సాధించిన ఈ కుర్రాడు ఏ మాత్రం తగ్గడం లేదని అంటున్నారు.
అందుకు తగ్గట్లుగా ఇప్పుడు రెండు కొత్త సినిమాలు చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు కూడా. 'ప్రస్తుతం నేను రెండు సినిమాలు చేస్తున్నా.. ఏకే ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ లో ఒకటి.. మారుతిగారు ఏకే ఎంటర్టెయిన్మెంట్స్ జాయింట్ వెంచర్ లో ఒకటి. రెండు సబ్జెక్టులు ఎక్సైటింగ్ గా ఉంటాయి. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తా'అంటూ ట్వీట్ చేశాడు రాజ్ తరుణ్.