Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2017 11:26:05
facebook Twitter Googleplus
Photo

చిల్లుపడినట్లుగా కురిసిన వర్షంతో సామాన్యులకే కాదు.. ప్రముఖులకూ తిప్పలు తప్పలేదు. రికార్డు స్థాయిలో పడిన వర్షానికి హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. విలాసవంతమైన అపార్ట్ మెంట్లు.. బాగుండే రోడ్లు సైతం వర్షాల ధాటికి తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

తాజా వర్షం సామాన్య.. మధ్యతరగతి కుటుంబాల వారినే కాదు.. ప్రముఖులకు సైతం చుక్కలు కనిపించేలా చేసింది. హైదరాబాద్ లో మణికొండలోని పంచవటి కాలనీలో నిన్నటి పరిస్థితి దారుణం. ఇందులో విలాసవంతమైన అపార్ట్ మెంట్లకు కొదవ ఉండదు. రోడ్లు కూడా చక్కగా ఉంటాయి. రిచ్ గా కనిపించే ఈ ప్రాంతం తాజా వర్షానికి భారీగా ప్రభావితమైంది.

ఎక్కడా గుంట అన్నది లేకుండా కనిపించే రోడ్లు కాస్తా ఇప్పుడు దెబ్బ తినటమే కాదు.. పలు అపార్ట్ మెంట్ల సెల్లార్లు మొత్తం వర్షపు నీటితో మునిగిపోయాయి. డబ్బుకు కొదవ లేని వారు సైతం ఆకలితో ఇబ్బంది పడిన పరిస్థితి. ఎందుకంటే.. సెల్లార్లు మొత్తం వర్షపునీటితో నిండిపోవటంతో.. ఇళ్లల్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఒకవేళ సాహసం చేసి కిందకు దిగాలంటే చిన్న పాములు.. చేపలు వర్షపు నీటితో ఉండటంతో అందులోకి దిగలేని పరిస్థితి. దీంతో.. పంచవటి ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఇదిలా ఉంటే.. ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. ప్రముఖ నటి కమ్ పొలిటీషియన్ ఆర్కే రోజా.. బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివబాలాజీ.. హీరో శర్వానంద్ తో సహా పలువురు ప్రముఖుల నివాసాలు పంచవటి కాలనీలోనే ఉంటాయి. దీంతో.. వీరంతా తాజా వర్షాలకు బాధితులుగా మారారు. కాలనీ ఏకంగా చిన్నపాటి చెరువుగా మారిపోయింది. ఎటు చూసినా నీళ్లే ఉండటంతో బయటకు రాలేని పరిస్థితి.

ఈ కాలనీలో రాజమౌళికి ఒక అతిథి గృహం ఉంది. అందులో మినీ థియేటర్ మొదలు.. లైబ్రరీ.. ఆఫీసు ఉన్నాయి. తాజా వర్షానికి నీళ్లు మెత్తం ఫ్లాట్ లోకి వెళ్లిపోవటంతో ఇంట్లోని పుస్తకాలు.. ఫైళ్లు.. వస్తువులు పూర్తిగా డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తోంది. మినీ థియేటర్ మొత్తం పాడైపోయిందని చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే రాజమౌళి అక్కడకు వచ్చినా.. లోపలికి వెళ్లే పరిస్థితి లేకపోవటంతో నిరాశగా వెనుదిరిగారు. పలు డాక్యుమెంట్లు.. స్క్రిప్ట్ లు ఆ ఆఫీసులో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఎందుకిలాంటి పరిస్థితి అంటే.. పంచవటి కాలనీ ఎగువన ఉన్న బుల్కాపూర్ నాలా పై మట్టి వంతెన కొట్టుకుపోవటంతో.. దిగువన ఉన్న ఇళ్లల్లోకి వరద నీరు ముంచెత్తింది. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శివబాలాజీ ఉంటున్న శ్యామ్స్ వింటేజ్ అపార్ట్ మెంట్స్ సెల్లార్ మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. ఇక.. ఆర్కే రోజా ఇంటికి వెళ్లే రోడ్డు మీద మూడు అడుగుల నీరు నిలిచింది.

,  ,  ,  ,  ,  ,