Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2015 14:42:28
facebook Twitter Googleplus
Photo

అమృతం రుచి ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదుగానీ, అది బాలు స్వరం కన్నా మధురంగా మాత్రం ఉండదని బలంగా చెప్పే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. బాలు పాట వింటూ వుంటే అమృతవర్షంలో తడుస్తున్నట్టుగా వుంటుంది .. మనసు ఆనంద తాండవం చేస్తున్నట్టుగా వుంటుంది. సంగీతంపై పెద్దగా పట్టులేకపోయినా, బాలమురళికృష్ణ వంటి ప్రసిద్ధ సంగీత విద్వాంసుల ప్రశంసలను సైతం పొందిన మధుర గాయకుడు ఆయన.

పాటల తోటను ఘంటసాల ఏలుతోన్న సమయంలో బాలు ప్రవేశించాడు. 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రంలోని ఒక పాట ద్వారా బాలు చిత్రపరిశ్రమకి పరిచయమయ్యాడు. తొలిపాటకి గాను ఆయన అందుకున్న పారితోషికం అక్షరాలా 300 రూపాయలు. ఘంటసాలగారితో కలిసి బాలు కొన్ని పాటలు పాడారు. ఆయన కూడా బాలూని ఎంతగానో ప్రోత్సాహించేవారు. ఒకసారి బాలు ఒక పాటని పాడి వచ్చేసిన తరువాత ఆయనకి ఒక విషయం తెలిసింది.

ఆ పాటని అంతకు ముందు ఘంటసాలగారితో పాడించారనీ .. అనారోగ్యం కారణంగా ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోవడంతో మరలా తనతో పాడించారని. తాను ఎంతగానో అభిమానించే .. ఆరాధించే ఘంటసాల మాస్టారుగారు పాడిన పాటను .. తాను పాడినందుకు బాలు బాధపడ్డాడు. తెలియక చేసిన అపరాధమనుకుంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. తన జీవితంలో తాను ఎక్కువగా బాధపడిన సంఘటన ఇదేనని ఇప్పటికీ ఆయన చెబుతూ ఉంటాడు. ఘంటసాలగారి పట్ల ఆయనకి గల గౌరవ మర్యాదలకీ .. అభిమానానికి ఈ సంఘటన అద్దంపడుతూ వుంటుంది. బాలూ సంస్కారానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంటుంది.

,