నటి శ్రీయను అదృష్టం, దురదృష్టం రెండూ వెంటాడాయని చెప్పాలి. కోలీవుడ్‌లో తొలి దశలోనే సూపర్‌స్టార్‌కు జంటగా శివాజీ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశాన్ని అందుకున్న అదృష్ట నటి శ్రీయ. ఆ తరువాత హాస్యనటుడు వడివేలుతో సింగిల్ సాంగ్‌లో ఆడడం ఆమె దురదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆ తరువాత అజిత్ తదితర ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశాలను శ్రీయ కోల్పోయారు. ఇక తాజా విషయానికొస్తే శ్రీయ ప్రతిభావంతురాలైన నటి అని ఇప్పడు కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే అవకాశాలు తగ్గాయన్నది వాస్తవం.
అందులోనూ హీరోయిన్ అవకాశాలు దాదాపు అడుగంటాయని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీయ సంచలన నటుడు శింబుకు అమ్మగా నటించడానికి సమ్మతించినట్లు కోలీవుడ్ వర్గాల బోగట్టా. శింబు తాజాగా అన్బానవన్ అసరాదవన్ అదంగాదవన్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ఆధిక్ రవిచందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో శింబు త్రిపాత్రాభినయం చేయనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లు ఎవరన్న విషయాన్ని చిత్ర యూనిట్ బహిర్గతం చేయలేదు. కానీ, శింబు పోషించే మూడు పాత్రల్లో ఒకటి నడి వయసు పాత్ర అని సమాచారం.
బహుశా ఈ పాత్ర ఇతర రెండు పాత్రలకు తండ్రి కావచ్చు. ఈ పాత్రకు జోడీగా మొదట చెన్నై చిన్నది త్రిషను సంప్రదించగా ఆ బ్యూటీ నో అన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. తాజాగా ఆ పాత్రను చేయడానికి ఉత్తరాది భామ శ్రీయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రానికి సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా ఇప్పటికే సంగీత బాణీలు కట్టే పనిలో నిమగ్నమయ్యారన్నది గమనార్హం.