కొత్త సినిమాలను మొదలెట్టడంతో అసలు స్టార్ హీరోలంతా కూడా ఒకటే ప్యాట్రన్ ఫాలో అవుతున్నారు. తామే చేస్తున్న ప్రస్తుత సినిమాలు రిలీజవ్వకమునుపే కొత్తవి మొదలెట్టేస్తున్నారు. బాహుబలి 2 రిలీజ్ కంటే ముందే ప్రభాస్ సాహో మొదలెట్టాడు. రంగస్థలం రానే లేదు.. చరణ్ అప్పుడే కొరటాల సినిమాను లాంచ్ చేశాడు. అలాగే స్పైడర్ సినిమా రాకమునుపే భరత్ అను నేను షూటింగ్ స్టార్ట్ చేశాడు మహేష్ బాబు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా డిజె దువ్వాడ జగన్నాథమ్ రిలీజ్ కాక మునుపే వక్కంతం వంశీతో ఒక సినిమాను ప్రకటించేశాడు.
నా పేరు సూర్య అనే టైటిల్ తో రూపొందుతున్న సదరు సినిమా తాలూకు షూటింగ్ ను మొదలుపెడుతున్నారు. ఈ బుధవారం నుండి ఏకధాటిగా ఒక షెడ్యూల్ పూర్తి చేస్తారట. అయితే ఈ షెడ్యూల్లో ఫ్యామిలీ ఎపిసోడ్లు మాత్రమే తీస్తారని తెలుస్తోంది. హీరోయిన్ అను ఎమ్యానుయేల్ తో కొన్ని సీన్లు చేస్తారట. ఆ తరువాత ఆగస్టు 3వ వారంలో అమెరికా నుండి వచ్చే ఒక ప్రత్యేక ట్రైనర్ బన్నీ లుక్ మొత్తాన్నీ కొత్తగా మార్చేసిన తరువాత మనోళ్ళు మిగతా పార్టు షూటింగ్ షురూ చేస్తారట. అది సంగతి.
రైటర్ వక్కంతం వంశీ ఈ సినిమాతో తొలిసారి డైరక్షన్ పగ్గాలు చేపడుతున్నాడు. ఈ సినిమాకు బాలీవుడ్ కంపోజర్స్ విశాల్-శేఖర్ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి తన కెమెరా పనితనంతో అలరించనున్నాడు.