సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ?కబాలి? సినిమా ప్రస్తుతం సౌతిండియాలో హాట్ టాపిక్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. కాగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం కొద్దిరోజులుగా అయోమయం నెలకొంది. మొదట జూలై 15న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న ప్రచారం జరగ్గా, చివరినిమిషంలో జూలై 22కు వాయిదా పడింది.
ఇక గత రెండు రోజులుగా జూలై 22న కూడా సినిమా విడుదల కాదని మరో ప్రచారం మొదలైంది. జూలై 29న గానీ, ఆగష్టు మొదటివారంలో కానీ ?కబాలి? విడుదలవుతుందని వినిపిస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా మలేషియాలో ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోస్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకం కూడా మొదలైంది. దీన్ని బట్టి చూస్తే, నిర్మాతల దగ్గర్నుంచి రిలీజ్ డేట్ విషయమై పక్కాగా స్పష్టత వచ్చేసిందని అర్థమవుతోంది. సెన్సార్ అయిపోగానే దర్శక, నిర్మాతలు విడుదల తేదీతో కూడా పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. కళైపులి థాను నిర్మించిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించారు.