Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2015 17:24:49
facebook Twitter Googleplus
Photo

బాహుబలి 2కి సంబంధించి ప్రాధమికమైన పని ఏదైనా ఉందంటే.. లొకేషన్ల ఎంపిక కార్యక్రమం. ఈ పనే అక్టోబర్ రెండో వారం (కాస్త అటూఇటుగా)లో మొదలైతే.. అది ఫైనల్ కావటానికి ఎన్ని రోజులు పడుతుంది? అన్నది ఒక ప్రశ్న. ఇక.. ఆ ప్రక్రియ పూర్తి అయి.. చిత్ర యూనిట్ సిద్ధమై.. సెట్స్ తయారు కావటానికి ఎన్ని రోజులు పడుతుంది? మరింత ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని మంచి ముహుర్తంలోనే మళ్లీ మొదలు పెట్టాల్సిందే. రోజులు కలిసి రాకపోతే.. వంద కోట్లకు పైమాట అయితే ప్రాజెక్టును మొదలు పెట్టే సాహసం మామూలుగా చేయరు. అది కూడా కుదిరాక.. సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.

అంటే.. సినిమా షూటింగ్ స్టార్ట్ కావటమే ఇప్పట్లో అయ్యే పరిస్థితి లేదా? అన్నది ఒక డౌట్. ఇక.. దర్శకుడి తీరు చూస్తుంటే.. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే సరికి 2016 జనవరి వరకు ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తుంది. అంటే.. 2016 జనవరి (ఇది కూడా అంచనా మాత్రమే. మరికాస్త లేట్ అయినా అడిగేదేమీ ఉండదనుకోండి) లో షూటింగ్ మొదలెడితే.. ఆ పార్ట్ ముగిసి.. దానికి స్పెషల్ ఎఫెక్ట్ లు పూర్తి చేయటం ఒక ఎత్తు. ఆ తర్వాత తాను కోరుకున్న విధంగా సినిమా వచ్చిందా లేదా అంటూ జక్కన్న చెక్ చేసుకొని.. తీర్చిదిద్దటం మరో మరో ఎత్తు.

ఇలా వివిధ దశల్లో బాహుబలి 2ను పూర్తి చేయటానికి ఎంతకాలం పడుతుందన్నది ఒక పెద్ద ప్రశ్న. బాహుబలి సినిమాను పూర్తి చేయటానికి ఎన్ని ఏళ్లు పట్టిందో తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యిందన్న నేపథ్యంలో.. మొదటి భాగం పూర్తి చేయటానికి పట్టిన సమయంలో సగం సమయమన్నా రెండో భాగానికి పట్టొచ్చన్న లెక్క (లాజిక్ లెక్క మాత్రమే. పక్కా ఏమీ కాదు. ఎందుకంటే జక్కన్న మనసులో మాట మనం చెప్పలేం కదా) వేసుకుంటే.. 2016లో ఎట్టి పరిస్థితుల్లో సినిమా పూర్తి కాదన్న మాటే.

సినిమా షూటింగ్ పూర్తి చేయటం ఒక ఎత్తు. దాన్ని సరైన సమయంలో విడుదల చేయటం మరో ఎత్తు. ఇంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే విడుదల చేయటం సాధ్యం కాదు. ఒకవేళ ఆఫ్ సీజన్ అయినా.. లేదంటే పరీక్షల సమయం లాంటిది వస్తే.. అప్పుడు విడుదల చేయటానికి ఏ దర్శక.. నిర్మాత ఇష్టపడరు. అందులోకి భారీ ప్రాజెక్టు విషయంలో.. ప్రతి రూపాయి లెక్కలోకి వచ్చేదే.

అంటే.. షూటింగ్ అయిన వెంటనే బాహుబలి 2 విడుదల చేయటం సాధ్యం కాదని ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక.. మిగిలిన దర్శకులకు.. జక్కన్న లెక్కకు చాలానే తేడా ఉంటుంది. తాను తీసే సినిమాకు విపరీతమైన ప్రచారం జరిగేలా చూసుకోవటంతో పాటు.. సినిమాపై అంచనాలు భారీగా పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవటం రాజమౌళికి అలవాటే. అంటే.. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేసరికి 2017 వరకూ పట్టే అవకాశం ఉందన్న మాట.

ఈ లెక్కన చూసుకుంటే.. బాహుబలి 2 థియేటర్లలోకి వచ్చేసరికి.. బాహుబలి మొదటి భాగం విడుదలై దాదాపు ఏడాదిన్నర.. రెండేళ్లు పట్టే అవకాశం ఉందని చిత్రపరిశ్రమకు చెందిన ఒక ప్రముఖుడు అభిప్రాయపడ్డారు. ఒకవేళ మరికాస్త ఆలస్యమైనా చేసేదేమీ లేదు.

అంటే.. ఒక సినిమాకు సంబంధించి తన మనసులో ఉన్న సందేహాల్ని సగటు ప్రేక్షకుడు తీర్చుకోవాలంటే.. ఒకటిన్నర.. రెండేళ్లు ఆగాలన్న మాట. తన కుతూహలాన్ని అన్ని రోజులు అట్టిపెట్టుకోవాలన్న మాట.

తాను కోరుకున్నది వెంటనే దొరక్కపోవటం ప్రతి విషయంలోనూ సాధ్యం కాకపోవచ్చు. కానీ.. ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి రావటం ఒక వినియోగదారుడికి జరిగిన సేవా లోపం కిందకు రాదా? సినిమా ప్రేక్షకుడికి మనోభావాలు ఉండవా? వారి కోర్కెల్ని పట్టించుకునే వారు ఉండరా? జక్కన్నను ఎంత ఇష్టపడితే మాత్రం.. ఇంతలా ఊరించి.. ఊరించి చంపటం ఏమైనా న్యాయంగా ఉందా? తనకేమాత్రం సంబంధం లేని విషయంపై ఉత్సాహాన్ని పెంచి.. ఊరిస్తూ.. ఊరిస్తూ.. విలువైన సమయాన్ని తన గురించే మాట్లాడేలా చేస్తున్న రాజమౌళి..కనీసం వారి మనసు నొచ్చుకోకుండా ఉండేలా ఎందుకు జాగ్రత్తలు తీసుకోవటం లేదు? సినిమాపై మమకారం ఉన్నందుకు ఇంత దీర్ఘకాల ఉత్కంఠ శిక్ష న్యాయమా? ఇలాంటి ప్రశ్నలు వేసే సగటు ప్రేక్షకుడుకి జక్కన్న ఏం సమాధానం చెబుతారు..?

,  ,  ,